ప్రేమను గురించి బైబిలులో చాలా చోట్ల వివరించడం జరిగింది. దేవునికి ప్రజల మీద ఉన్న ప్రేమ, ప్రజలకు దేవునిపై ఉండవలసిన ప్రేమ, కుటుంబములో ఉండవలసిన ప్రేమ, ఒకరిపై మరొకరికి ఉండవలసిన ప్రేమ, ఇలా ప్రేమను గురించి చాల చోట్ల దేవుడు వివరించాడు. లెక్కలేనన్ని ఉదాహరణలు దేవుని వాక్యములో గలవు. ఈ ప్రేమ పవిత్రమైనది, పరిశుద్ధమైనది. అయితే ఈ లోకము ప్రేమకు, కామమునకు మధ్య వ్యత్యాసము లేకుండా చేసింది. దేవుడు పాత నిబంధన గ్రంధములో ఇశ్రాయెలీయులను ప్రేమించెను గనుక వారిని ఐగుప్తు నుండి, బానిసత్వమునుండి వారిని విడిపించెను. మనమందరమూ పాపులకు బానిసలై, నరకమునకు దగ్గరైనపుడు, దేవుడు మనకు రక్షణ దయ చేశారు.
యోహాను సువార్త 3:16,17
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు.
పాపులమైన మనము రక్షణ పొందడానికి, నిత్యజీవమును పొందునట్లు యేసు క్రీస్తు సిలువపై మన కొరకు మరణించారు. మనము దేవునికి శత్రువులుగా, పాపులుగా ఉన్నప్పుడు మన కోసం దేవుడు యేసు క్రీస్తుని ఈ లోకమునకు పంపారు. ఈ ప్రేమను మించిన ప్రేమ ఎక్కడా కనిపించదు. యేసు క్రీస్తు వారు మనము ఎటువంటి ప్రేమ కలిగియుండాలో యోహాను సువార్త 13:34-35 లో ఇలా చెప్పారు.
యోహాను సువార్త 13:34-35
మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించి నట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను.
ఆయన మనల్ని ప్రేమిస్తున్నట్లుగా మనం ఇతరులను ప్రేమిస్తున్నామా? మనము ప్రేమిస్తే వారికోసం మన ప్రాణం పెట్టాలి(యోహాను సువార్త 15:13). స్వచ్ఛమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమకు గల లక్షణాలు 1 కొరింతీయులకు 13 లో ఇవ్వబడ్డాయి.