ఆత్మఫలము – సాత్వికము!

యేసు క్రీస్తు ప్రభువు సాత్వికుడని మనందరికీ తెలుసు. ఆయన పాపులతోను, బలహీనులతోను ఎంతో సాత్వికముతో వ్యవహరించారు. సువార్తలలో చాలా సంఘటనలు దీనిని ధృవీకరిస్తున్నాయి. ఆయన సాత్వికుడును, దీనమనస్సు గలవాడును ( మత్తయి 11:28-30). జక్కయ్య, వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీ, మరియు ఇలాంటి చాలా మంది పాపులతో యేసు క్రీస్తు సాత్వికముగా వ్యవహరించారు. వ్యభిచారములో పట్టుబడిన స్త్రీ సంఘటన తీసుకుంటే, అక్కడున్న వారిలో యేసు క్రీస్తు తప్ప అందరూ పాపులే. కానీ ఒక్క వ్యక్తి మాత్రమే అక్కడ కృపను పొందారు. అక్కడనుండి అందరు వెళ్ళిపోయినా తరువాత యేసు క్రీస్తు చెప్పిన మాటలు జాగ్రత్తగా గమనిస్తే ఆయన అ స్త్రీ తో ఇలా అంటారు “నీవు వెళ్లి ఇక పాపము చేయకుము”. ఆమె పాపి అని యేసు క్రీస్తు కూడా అంటున్నారు, కానీ ఆ విషయముతో వ్యవహరించిన విధానము వేరు. ఇక్కడ యేసు క్రీస్తు వారి సాత్వికము ఇలా ఉంది “సత్యము నందు రాజీ పడకుండా దయ చూపించడం”. యేసు క్రీస్తు ప్రభువు ఆమె పై దయ చూపారు. ఆమె క్షమించబడినది. మనము ఇటువంటి సాత్వికమును కలిగియున్నామా? మనము కూడా పాపులమే. దేవుడు మనతో ఎంతో సాత్వికముగా వ్యవహరిస్తున్నారు. మనమందరమూ ఒక్కరోజులోనే పరిశుద్ధులుగా, సంపూర్ణులుగా అయిపోవాలని దేవుడు అడగట్లేదు. మనల్ని ఆయన తన వాక్యముతో ప్రతి రోజు శుభ్రపరుస్తున్నారు. ఆయన చిత్త ప్రకారం మనల్ని మార్చుకుంటున్నారు. అయితే ఈ దశలో మనము కూడా ఇతరుల పట్ల సాత్వికము, దయ, ప్రేమ కలిగియుండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వారియొద్ద ఎక్కువగా అడుగుదురు.

2 కొరింతీయులకు 10:1 లో పౌలు ఇలా అంటున్నారు.

“మీ ఎదుట నున్నప్పుడు మీలో అణకువగలవాడనైనట్టియు, ఎదుట లేనప్పుడు మీయెడల ధైర్యము గలవాడనైనట్టియు, పౌలను నేనే యేసుక్రీస్తుయొక్క సాత్వికమును మృదుత్వమునుబట్టి మిమ్మును వేడుకొను చున్నాను”.

1 పేతురు 3:15 లో పేతురు ఇలా అంటున్నారు.

“నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి,మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి”.

మనము ఇతరులతో సాత్వికముగా, దయతో వ్యవహరిస్తున్నామా? 2 తిమోతి 2:24 లో అందరితో సాత్వికముగా ఉండమని పౌలు తిమోతితో చెప్తున్నారు. దేవుని సేవకులుగా మనము కూడా అందరితో సాత్వికముగా ఉంటున్నామా?

ఇటువంటి సాత్వికమును దేవుడు మనకు దయచేయమని ఈరోజే ఆయనకు విన్నవించుకుందాం.

1ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును. 2అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు 3నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు అతడు సత్యము ననుసరించి న్యాయము కనుపరచును. 4భూలోకమున న్యాయము స్థాపించువరకు అతడు మందగిలడు నలుగుడుపడడు ద్వీపములు అతని బోధకొరకు కనిపెట్టును.యెషయా 42:1-4

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *