కనికరము (కరుణ)!

విలాపవాక్యములు 3:22,23
యెహోవా కృపగలవాడు. ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము.
అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది.

మనము ఈ క్షణం ఇలా శ్వాస తీసుకోగలుగుతున్నామంటే దానికి కారణం దేవుని వాత్సల్యత. ప్రతి దినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఈ క్షణం వరకు మనము చేసిన పాపముల వలన మనము నిర్మూలము కావలసినవారము. కానీ మన దేవుడు నమ్మదగినవాడు, కృపగలవాడు. అందుకే తన కుమారుని మన పాపముల నిమిత్తము మనకు అనుగ్రహించెను.(యోహాను సువార్త 3:16, John 3:16). మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి రక్తము వలెనే మనకు పాప క్షమాపణ కలదు. అందుకే మన పాపములను ఒప్పుకుని, పశాత్తాప్పడితే ఆయన వాత్సల్యతతో మనల్ని క్షమిస్తారు. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృపాక్షమాపన గల దేవుడైయున్నాడు అని డానియేలు 9:9 (Daniel 9:9) లో వ్రాయబడింది. మన పాప బుద్ధితో దేవునికి విరోధముగా తిరుగుబాటు చేసినా మనము అది ఒప్పుకుని పశాత్తాప్పడితే ఆయన కృపతో మనల్ని క్షమిస్తాడు. దావీదు వ్రాసిన చాలా కీర్తనలలో పలుమార్లు “దేవా, నా మీద దయ చూపండి, నా మీద కృప చూపండి అని మొరపెట్టుకున్నాడు.

ఉదాహరణకు కీర్తనలు 51: 1(Psalms 51:1) లో దావీదు ఇలా మొరపెట్టుకుంటున్నాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. లూకా 18:38(luke 18:38) లో గ్రుడ్డివాడైన భిక్షగాడు యేసు క్రీస్తు ఆ మార్గములో వెళుతున్నారని తెలిసి యేసూ, దావీదు కుమారుడా! నన్ను కరుణించుము అని మొరపెట్టుకున్నాడు. మనకు కూడా ఆయన యొక్క కృప, వాత్సల్యము, మన రక్షణ కొరకు, పాప క్షమాపణ కొరకు, ఆత్మలో స్వస్థత కొరకు ప్రతి దినము అవసరము. మనము ఆయన కృప, వాత్సల్యము పొందడానికి ఏం చేయాలి? నిర్గమకాండం 20:6(Exodus 20:6) లో నన్ను ప్రేమించి, నా ఆజ్ఞలు గైకొను వారిని వెయ్యితరములవరకు కరుణించువాడనై యున్నాను అని దేవుడు అంటున్నాడు. మనము దేవుడిని ప్రేమించి, ఆయన ఆజ్ఞలను పాటిస్తే ఆయన కరుణ, వాత్సల్యము మనపై ఉంటాయి. మత్తయి సువార్త 5:7 (Matthew 5:7) లో యేసు ప్రభువు ఇలా అంటున్నారు.

కనికరము గలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు. మనము దేవుని యొక్క కనికరము, వాత్సల్యము, ప్రేమ, కరుణ పొందాలంటే మనము ఇతరులపై ప్రేమ, కరుణ, కనికరము, వాత్సల్యము కలిగి ఉండాలి. ఇతరులు అంటే అందరూ. మనల్ని ప్రేమించి ఇష్టపడేవారే కాదు, మనల్ని అపహసించేవారు, మనమంటే ఇష్టం లేని వారు, మనల్ని మోసపుచ్చేవారు, మనకి ఇష్టం లేని వారు. ఇలా అందరి పై ప్రేమ, కనికరము కలిగి ఉండాలి. లూకా 6:36 (Luke 6:36) లో చెప్పినట్లు మన పరలోక తండ్రి కనికరముగలవాడై యున్నట్లు మనము కూడా కనికరము గలవారిగా ఉండాలి.

కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును; కనికరము తీర్పును మించి అతిశయపడును. – యాకోబు 2:13(James 2:13).

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *