ఒక నెల క్రితం మా అత్తగారింటికి వేసవి సెలవులకు వెళ్ళాం. ఒకరోజు ఆ ఇంట్లో ఉన్న స్టడీ రూమ్ కి వెళ్ళాను. ఆ స్టడీ రూమ్ లో ఒక అల్మారా ఉంది. ఆ అల్మారా పై అరలో చాలా పాత పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు ఏంటో చూద్దామని ఒక్కొక్కటి తెరిచి చదువుతున్నాను. ఆ పుస్తకాలు చాలా పద్దతిగా అమర్చి ఉన్నాయి. అందులో కొన్ని పాత నవలలతో పాటు చాలా బైబిళ్ళు కూడా ఉన్నాయి. నా భార్య చిన్నప్పటివి, కాలేజీ టైం లో కొన్నవి, ఆమె బాప్తిస్మము తీసుకున్నప్పటి బైబిలు ఇలా అన్నీ కలిపి సుమారుగా ఒక ఇరవై బైబిళ్లు ఉండవచ్చు. అందులో చాలా రకాల ఇంగ్లీష్ వెర్షన్ బైబిళ్లు కూడా వున్నాయి. ఆ బైబిళ్లు చూసి నాకు ఇలా అనిపించింది, “అల్మారాలో ఇన్ని రకాల బైబిళ్లు ఉన్నాయి, ఆ బైబిల్ లో ఉన్న వాక్యము ఎంతవరకు ఆ ఇంట్లో ఉన్న వారి హృదయాలలో ఉంది?” నిజమే కదా! ఎన్ని బైబిళ్లు ఉన్నాయి అన్నది ముఖ్యం కాదు, దేవుని వాక్యము ఎంత మన హృదయములో ఉన్నది, ఆ వాక్యము మన మీద ఎంతవరకు ప్రభావము చూపిస్తుంది, ఆ వాక్యము ద్వారా మన జీవితములు దేవునికి ఇష్టముగా ఎంతవరకు మారాయి అన్నది ముఖ్యము. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, అందులో విశ్వాసులకు బైబిలు యాప్ ఉంటుంది. ఈ ఫోన్స్ ద్వారా, ఇంట్లో బైబిళ్లు, సంఘములో వాక్యము, సువార్త సభలు, ఇంకా ఎన్నో రకాల కూడికలు, వీటన్నిటి ద్వారా దేవుని వాక్యము ఈ కాలంలో చాలా అందుబాటులో ఉంది కానీ మనము ఎంతవరకు ఆ వాక్యములో సమయము గడుపుతున్నాము? ఎంతవరకు మన జీవితములను మార్చుకుంటున్నాము?
దేవుని వాక్యము ఎంతో ప్రాముఖ్యమైనది. కొన్ని ప్రాముఖ్యతలు ఇప్పుడు చూద్దాం.
1.వాక్యము దేవుడే : యోహాను సువార్త మొదటి వచనములో చెప్పినట్లు ఆదియందు వాక్యము దేవుడై ఉండెను అని ఉంటుంది. ఆ వాక్యము యేసుక్రీస్తే. ఇదే అధ్యాయములో 14 వచనం లో వాక్యము శరీరధారియై మన మధ్యన నివశించెను అని ఉంటుంది. దేవుడు మనతో చెప్పాలనుకున్న సత్యము యేసు క్రీస్తు మాటల ద్వారా, ఆయన క్రియల ద్వారా చెప్పారు. ఇంకా చెప్పాలంటే దేవుని మాటలకు, ఆయన ఆలోచనలకు యేసుక్రీస్తు జీవితమునకు ఎటువంటి బేధము లేదు. అందుకే యేసు క్రీస్తు కూడా “నేనే సత్యమును (యోహాను సువార్త 14:6)”, “నా యందు మీరు నిలుచుడి (యోహాను సువార్త 15:7)” అని చెప్పగలిగారు.
యోహాను 1:1
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
యోహాను సువార్త 1:14
ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.
యోహాను సువార్త 8:31
కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు;
మనము ఆ వాక్యమునందు నిలిచియున్నామా?
2.సృష్టికి మూలం దేవుని వాక్యము: ఆదికాండము మొదటి అధ్యాయములో ఈ లోకము సృష్టి ఎలా జరిగిందో వ్రాయబడింది. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. మూడవ వచనంలో వెలుగు నుండి 27 వ వచనంలో నరుల సృష్టి వరకు అన్నీ దేవుడు పలుకగా కలిగెను. ఈ లోకము మొత్తము కూడా దేవుని యొక్క వాక్కు వలన సృష్టించబడినది. నదులు, సముద్రాలు, పక్షులు, జంతువులు, చెట్లు, గ్రహాలు, నక్షత్రాలు ఇలా అన్నీ కూడా ఆయన వాక్యముతోనే ఇంకా కొనసాగుతున్నాయి. పైన చెప్పినట్లు యేసు క్రీస్తే దేవుని వాక్యము, ఆయనే సమస్తమునకు ఆధారము. కావునా సమస్త సృష్టికి దాని మనుగడకు దేవుని వాక్యమే ఆధారము.
ఆదికాండము 1:3
దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.
కోలస్సీయులకు 1:17
ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్న వాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.
3.దేవుని వాక్యము రక్షణలోకి నడిపిస్తుంది: దేవుని వాక్యము మనల్ని రక్షణలోనికి నడిపిస్తుంది. చాలా మంది దేవుని వాక్యము చదవడం ద్వారానే ఆయన ప్రేమను అర్ధం చేసుకుని క్రీస్తును విశ్వసిస్తారు. అపోస్తుల కార్యములు గ్రంథములో కూడా చాలా చోట్ల జనులు దేవుని వాక్యము విని క్రీస్తును విశ్వసించారు అని వ్రాయబడినది. సౌలును పౌలుగా మార్చినది, మొదటి శతాబ్దపు క్రైస్తవులను విశ్వాసులుగా మార్చినది దేవుని వాక్యమే. అదే వాక్యము ఇప్పటికి అవిశ్వాసులను రక్షణలోకి నడిపిస్తూనే ఉంది, విశ్వాసులను బలపరుస్తూనే ఉంది. ఆ వాక్యము విన్నప్పుడు దానిని స్వీకరించడానికి మన హృదయము సిద్ధముగా ఉండాలి. పౌలు, పేతురు, యోహాను వాక్యము చెప్పినప్పుడు చాలా మంది దానిని స్వీకరించకుండా వారిని వ్యతిరేకించారు (అపోస్తుల కార్యములు 17:8, 19:9). అదే వాక్యమును విన్న చాలా మంది యేసును విశ్వసించి రక్షణ పొందారు.
అపోస్తుల కార్యములు 2:37
వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా పేతురుమీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.
అపోస్తుల కార్యములు 4:4
వాక్యము వినినవారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య యించుమించు అయిదువేలు ఆయెను.
4. దేవుని వాక్యము మనల్ని శుద్ధి చేస్తుంది: ఎఫెసీయులకు 5:27 లో వాక్యముతో ఉదకస్నానముచేత సంఘమును యేసు క్రీస్తు పవిత్రపరచును అని వ్రాసియుంది. ఈ వచనమును రెండు భాగములుగా చూస్తే మొదటిది, యేసు క్రీస్తు మనల్ని రక్షించడానికి సిలువపై తనని తాను అర్పించుకున్నారు. ఆయన రక్తము ద్వారా మనలని విముక్తుల్ని చేశారు. రెండవది, పరిశుద్ధమైనదిగాను, నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను మనల్ని చేయుటకు ఆయన వాక్యము ద్వారా మనల్ని శుద్ధి చేస్తున్నారు.
ఎఫెసీయులకు 5:25-27
25పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, 26అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను,
27నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.
యోహాను 17:17
సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము.
5. దేవుని వాక్యము మనము దేవునిలో ఎదగడానికి సహాయం చేస్తుంది: మన శరీరం బ్రతకడానికి ఆహారం, నీరు, గాలి ఎలా అవసరమో, మన ఆత్మీయ జీవితంలో ఎదగడానికి కూడా దేవుని వాక్యము, ప్రార్ధన, సంఘ సహవాసము అంతే అవసరం. శిశువు పుట్టిన తరువాత పాలు త్రాగితేనే బాలుడుగా ఎదుగుతుంది, తరువాత యువకుడుగా, మధ్యవయస్కుడిగా ఇలా ఎదుగుతూ ఉండాలి. శిశువు ఎదగకుండా అలానే ఉండిపోయినా, నెమ్మదిగా ఎదిగినా ఆ శిశువు ఆరోగ్యంగా లేదు అనుకుంటాం. క్రైస్తవ జీవితములో కూడా శిశువులుగానే మనం మిగిలిపోకూడదు. దేవుడు చూపిన మార్గములో జీవిస్తూ ఆత్మీయముగా ఎదిగితేనే దేవుని చిత్తమును నెరవేర్చినవారవుతాం. మన ఆత్మీయ జీవితం ఆరోగ్యముగా ఉండటానికి దేవుని వాక్యం సహాయము చేస్తుంది.
6. దేవుని వాక్యము మన తప్పుల్ని సరిచేస్తుంది: దేవుని వాక్యము రోజూ ధ్యానం చేస్తే మనము తప్పు మార్గంలో ఆలోచిస్తున్నా, దేవుని చిత్తములో జీవించకపోయినా ఆ వాక్యం మనల్ని సరిచేస్తుంది. 2 తిమోతికి 3 :17 లో ప్రతీ లేఖనము తప్పు దిద్దుటకు కూడా ఇవ్వబడెను అని ఉంటుంది. ఎప్పుడైనా జీవితములో కష్టాలు వస్తే వారు ఎదో పాపం చేస్తున్నారు అందుకే దేవుడు శిక్షిస్తున్నాడు అని చాలా మంది అనుకుంటారు. కానీ దేవుడు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారినే దండిస్తారు అని ఉంటుంది. అంటే మనం కష్టాలు పడటం దేవుడికి ఇష్టం అని కాదు. ఆ కష్ఠాల ద్వారా మనం దేవునికి ఇంకా దగ్గరై ఆయన మార్గం లో నడుస్తాము అని ఆయన కోరిక.
2 తిమోతికి 3:16-17
16దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును,
17ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.
హెబ్రీయులకు 12:6
6ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాంషించు ఆయన హెచ్చరికను మరచితిరి.
అంతే కాకుండా మనము దేవుని వాక్యము చదువుతున్నపుడు మన ఆలోచనలు, ప్రణాళికలు, పద్ధతులు ఆయన వాక్యముతో ఏకీభవిస్తున్నాయో లేదు చూసుకోవాలి. జీవముగల దేవుని వాక్యం మన హృదయపు ఆలోచనలు, తలంపులు లోతుగా తెలుసుకోగల శక్తి గలది.
హెబ్రీయులకు 4:12-13
12ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది.
13మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికిలెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.
దేవుని వాక్యము ఎటువంటి తప్పులు లేనిది, పరిపూర్ణమైనది, మరియు సంపూర్ణ అధికారము కలిగినది.
మార్కు 13:31
ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు.
మనందరము ఆ దేవుని వాక్యములో ప్రతీరోజు నడుచుకునే కృపను ఆ ప్రభువు ప్రసాదించును గాక!