యాకోబు 4:6
.… దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్ర హించును అని లేఖనము చెప్పుచున్నది.
మనము పాపములో పుట్టాము అని వాక్యము సెలవిస్తుంది. యేసు క్రీస్తు మన పాపముల నిమిత్తము, మన విమోచన కొరకు సిలువపై మరణించారు. ఆయన పాపమును జయించెను. పాపము లేనివాడైనను మనల్ని ఎంతో ప్రేమించెను గనుక మనకు రక్షణ మార్గమును దయచేసెను. యేసు క్రీస్తు ప్రేమను, రక్షణను స్వీకరించిన తరువాత కూడా మనము పాపములో పడితే దానికి కారణము గర్వము లేదా అహంకారము. మన లోపల ఉండే గర్వము మనల్ని పాపము వైపు నడిపిస్తుంది. ఈ గర్వము మనల్ని అన్ని పాపములకు పురిగొల్పుతుంది. ఈ గర్వము మనము ఎదుటివారిని క్షమించవలసినప్పుడు క్షమించొద్దు అని చెబుతుంది. ఎదుటివారికి సహాయము చేయవలసినప్పుడు వద్దు అని చెబుతుంది. అందరికంటే నేనే గొప్ప అని చెబుతుంది. నీ కొరకే ప్రార్థన చేసుకో అని చెబుతుంది. మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది. వాక్యం చదువనీయదు. దేవుని పై ఆదారపడనీయదు. మన స్వార్థ ఆలోచనలకు, స్వార్థ క్రియలను పెంచి పోషిస్తుంది. అన్నీ నాకొరకే, అన్నీ నేనే, అన్నీ నా వల్లే అనే “నా” జబ్బు కలిగి మనల్ని స్వార్థ మనుషులుగా తయారుచేస్తుంది. ఇటువంటి అహంకారమును, అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు. సర్వాధికారి, సర్వ సృష్టి కర్త, సార్వభౌముడు అయిన దేవుడు మనల్ని ఎదిరిస్తే పరిస్థితి ఎలా ఉంటుదో ఊహించడానికి కష్టమే. దేవుని కంటే నేనే గొప్ప, నేను దేవునితో సమానునిగా చేసికొందును అని గర్వముతో పడిపోయిన వాని గురించి యెషయా 14 లో వ్రాసి ఉంది. దేవునికి మహిమ చెల్లించకుండా తనను తాను హెచ్చించుకున్న నెబుకద్నెజరు దేవుని యొక్క తీర్పును అనుభవించాడు. ఆ తరువాత తన తప్పు తెలుసుకుని దేవుని వైపు తిరిగిన తరువాత తన రాజ్యము తనకు దక్కెను. నెబుకద్నెజరు దేవుని గురించి ఇలాగు సాక్ష్యం ఇచ్చుచున్నాడు.
దానియేలు 4:37
ఈలాగు నెబు కద్నెజరను నేను పరలోకపు రాజుయొక్క కార్యములన్నియు సత్య ములును, ఆయన మార్గములు న్యాయములునై యున్న వనియు, గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తు డనియు, ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘన పరచుచు నున్నాను.
ఈ గర్వము లేదా అహంకారము మనలో ఉంటే, ఈ రోజే దేవుని వద్దకు వెళ్లి మన పాపమును ఒప్పుకుని క్షమాపణ వేడుకుని ఆయన కృపను పొందుకుందాం. ఆయన నమ్మదగినవాడు. యేసు క్రీస్తు రక్తము దుర్నీతి నుండి మనల్ని దూరం చేస్తుంది. ఆ రక్త ప్రోక్షణతో మన పాపములను కడగమని దేవుని వేడుకుందాం.