దేవుని వాక్యము!

దేవుని వాక్యము సజీవమైనది. అది నిత్యమూ నిలచియుండును. ఆకాశమును, భూమియు గతించును గానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు అని యేసు క్రీస్తు మత్తయి 24:35 లో అన్నారు. 2 తిమోతి 3:16,17 లో దేవుని వాక్యము గురించి ఇలా వ్రాసి ఉంది.

2 తిమోతి 3:16,17
దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును,  17ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.

దేవుని వాక్యము దైవావేశము వలన కలిగినది. ఈ వాక్యము విన్నప్పుడు లేదా ధ్యానించినపుడు దేవుడు మనతో మాట్లాడతారు. మనకు వాక్యము ద్వారా దేవుడు ఉపదేశిస్తారు, మనల్ని ఖండిస్తారు, మన తప్పులు దిద్దుతారు. ఈ వాక్యము మన హృదయములో ఉన్న ఆలోచనలను, తలంపులను శోధిస్తుంది.

హెబ్రీయులకు  4:12
ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను  విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.

పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని అప్పగించుకుని దేవుని వాక్యమునకు మనపై అధికారమును అప్పగిస్తే దేవుడు మన హృదయములో ఉన్న చెడును బయలుపరుస్తాడు. కానీ మనం చేయవలసిన పని దేవుని వాక్యమును తిరస్కరించకుండా దానిని స్వీకరించాలి. దేవుని వాక్యము అగ్ని వంటిది మరియు బండను బద్దలు చేయు సుత్తి వంటిది.

యిర్మియా 23:29
నా మాట అగ్నివంటిదికాదా? బండను బద్దలుచేయు సుత్తెవంటిది కాదా?

దేవుని వాక్యమునకు మనల్ని అప్పగించుకుంటే మన లోపల ఉన్న అపనమ్మకము, అవిధేయత వంటి వాటిని అది దహించివేస్తుంది. మనలో ఉన్న కఠినమైన రాతి గుండెను వాక్యమనే సుత్తి ముక్కలు చేసి మనకు మాంసపు గుండెనిస్తుంది.

ఎఫెసీయులకు 5:26,27
అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను,  27నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.

యేసు క్రీస్తు తన సంఘమును వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్ర పరచి పరిశుద్ధపరచుచున్నారు. దేవుని వాక్యములో మనల్ని పవిత్ర పరచే శక్తి ఉంది.

యోహాను 15:3
నేను మీతో చెప్పిన మాటనుబట్టి మీరిప్పుడు పవిత్రులై యున్నారు.

యేసు ప్రభువు చెప్పిన మాటలు విని ఆయన శిష్యులు పవిత్రపరచబడ్డారు. దేవుని వాక్యముతో జనులు ఎలా వ్యవహరిస్తారో యేసు ప్రభువు మార్కు 4 లో ఒక ఉపమానముగా చెప్పారు. అందులో చెప్పినట్లు మంచి నేలను విత్తబడిన విత్తనముగా మన జీవితములో దేవుని వాక్యము ఉండాలి. దేవుని వాక్యమును తృణీకరించక, దేవుని యొక్క కృపను బట్టి విశ్వాసముతో వాక్యమును స్వీకరిద్దాం. దేవుని వాక్యము మనల్ని పవిత్రపరచగా వచ్చు ఫలములను బట్టి దేవునికి మహిమ కలుగును గాక.

దేవుని వాక్యము గురించి దావీదు కీర్తనలలో ఇలా వ్రాసాడు.

కీర్తనలు  119:50,103,105
నీ వాక్యము నన్ను బ్రదికించి యున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది.
నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటె తీపిగా నున్నవి.
నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.
యెషయా 40:8
గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *