మత్తయి 16:13-20
పై వాక్య భాగములో యేసు క్రీస్తు ప్రభువు ఆయన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు శిష్యులు ఇలా సమాధానం ఇచ్చారు. కొంతమంది ఏలియా ప్రవక్తయని, కొంతమంది బాప్తిస్మమిచ్చు యోహాను ప్రవక్తయని, మరి కొంతమంది యిర్మీయా ప్రవక్తయని అనుకుంటున్నారు. యేసు ఆయన గురించి సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారు, శాస్త్రులు, పరిసయ్యలు కాదు. ఆయన చేసే అద్భుతముల వలన, స్వస్థతల వలన అప్పటికే శాస్త్రులకు, పరిసయ్యలకు యేసు అంటే చాలా ద్వేషం ఉంది. కానీ సామాన్య ప్రజలు కూడా ఆయనను మెస్సయా అని గాని, రక్షకుడు అని గాని, దేవుని కుమారుడు అని గాని అనుకోవడం లేదు. ఆయనను ఒక అద్భుత శక్తులు కలిగిన ప్రవక్తగా మాత్రమే ప్రజలు చూస్తున్నారు. అందుకే పిలాతు, మీకు యేసు కావాలా లేక బారబ్బా కావాలా అని యూదులను అడిగినపుడు మాకు బారబ్బా నే కావాలి, యేసును శిలువ వేయండి అని ఆ ప్రజలు చెప్పారు. వారికి యేసు నిజముగా ఎవరు అనే సత్యము తెలియదు. చాలా మంది ప్రజలు, కొంతమంది శిష్యులతో సహా యేసు ఎవరో ఆయన పునరుత్తానము వరకు కూడా తెలియలేదు.
15 వ వచనంలో, ఆయన గురించి శిష్యులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని అదే ప్రశ్న యేసు శిష్యులని అడిగారు. ఇక్కడ పరిశీలిస్తే ఒక్క పేతురు మాత్రమే సమాధానం చెప్తారు, మిగిలిన శిష్యులు ఎవరూ ఏమీ చెప్పరు. అప్పుడు పేతురు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవు, క్రీస్తువు అని సమాధానం చెప్తారు. శాస్త్రులు, పరిసయ్యలు పేతురు చెప్పిన దానిని దేవునికి వ్యతిరేకమైన మాటలు గా పరిగణిస్తారు.
అప్పుడు యేసు పేతురు తో, ఆశీర్వదించబడినవాడవు, పరలోకపు తండ్రి మాత్రమే ఈ విషయాన్ని బయలుపరచగలరు అని చెప్తారు. అందుకే యోహాను 6:47 లో యేసు ఇలా అంటారు, తండ్రి మాత్రమే ఎవరినైనా యేసు వద్దకు చేర్చగలరు.
యోహాను 6:47
47దేవుని యొద్దనుండి వచ్చినవాడు తప్ప మరి యెవడును తండ్రిని చూచియుండలేదు; ఈయనే తండ్రిని చూచి యున్న వాడు.
మనకి వేసుకోవాల్సిన ప్రశ్న – యేసు క్రీస్తు గురించి మనము ఏమి అనుకుంటున్నాము? మనలో కొంతమంది క్లిష్ట సమయాలలో, అస్వస్థత సమయాలలో, జీవితములో ఏదైనా సమస్య ఉన్నప్పుడు మాత్రమే యేసు వద్దకు వస్తాము. ఆ సమస్య గాని, అస్వస్థత గాని తీరిపోగానే యేసు ను మర్చిపోతాము. ఆయన నిజముగా ఎవరో చెప్పగలగాలంటే, అది ఆయనతో మనకు ఉన్న అనుబంధముపై ఆధారపడి ఉంటుంది. మన పాప విముక్తి కొరకై సిలువ పై రక్తము కార్చి, ప్రాణము పెట్టిన రక్షకుని గా యేసును మనము యెరుగుదుమా? మరణాన్ని గెలిచి మూడవ దినమున తిరిగి లేచిన సజీవుడైన దేవుని కుమారునిగా యేసును మనము యెరుగుదుమా? మన కోసము తండ్రి యొద్ద నిరంతరమూ ప్రార్ధించు ప్రధాన యాజకునిగా ఆయన్ను యెరుగుదుమా?
ఆయన శిలువపై ప్రసాదించిన పాప క్షమాపణ మీకు కావాలంటే, ఆయన ప్రసాదించు రక్షణ భాగ్యము మీరు పొందుకోవాలంటే యేసు క్రీస్తు ప్రభువును రక్షకునిగా ఈరోజే మీ హృదయములోనికి ఆహ్వానించండి. ప్రకటన 3:20 లో చెప్పినట్లుగా, ఆయన మీ హృదయము తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నారు. ఈరోజే ఆయన పిలుపును విని రక్షకునిగా అంగీకరించండి.