దేవుని వెదకు!

ఆదికాండం 6:8
అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను

నోవాహు నివసించిన కాలంలో భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను, భూలోకము బలాత్కారముతో నిండియుండెను. నరులు చెడుతనము తో నిండియుండెను. ప్రతి మానవుడి ఆలోచనలు, ఊహలు చెడ్డవిగానే ఉన్నవని దేవుడు చూచెను. ఆ కాలంలో నోవాహు తప్ప మరెవరూ దేవుని తో నడవలేదు. నోవాహు నీతిమంతుడును మరియు తన తరములో నిందారహితుడు గాను ఉండెనని  దేవుడు చెప్పుచున్నాడు (ఆదికాండం 6:9). అందరూ చెడు మార్గములోనే వెళుతున్నారు నేను కూడా ఆ మార్గములోనే వెళితే తప్పేమిటి? అని నోవాహు కూడా తన జీవిత శైలి లో రాజీ పడి ఉండవచ్చు. కాని నోవాహు రాజీ పడలేదు . ఆయన దేవుని తో నడిచెను అని దేవుని వాక్యము చెబుతుంది. తన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆయన దేవుని వెదకుచూ దేవుని తో సంబంధం కలిగియుండెను. నోవాహు యెహోవా దృష్టి యందు ఎందుకు కృప పొందాడు? దీనికి జవాబు “తన జీవితములో దేవుని చిత్తము నెరవేర్చడానికి”. నోవాహు ఒక్కడే తన మాట విని తనకు విధేయుడుగా ఉంటాడని దేవునికి తెలుసు. దేవుడు నోవాహును ఓడని చేయమన్నప్పుడు,అతను మారు మాట్లాడలేదు మరియు ఏ ప్రశ్న అడగలేదు. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తును చేసెను (ఆదికాండం 6:22).

ఆ రోజులలో నోవాహు దేవుని స్వరమును వింటూ, ఆయన మాటకి విదేయునిగా ఉండెను. ఆదికాండం 7:1 లో “యెహోవా ఈ తరమువారిలో నీవే నా యెదుట నీతి మంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ యింటి వారును ఓడలో ప్రవేశించుడి.” అని వాక్యము చెబుతున్నది. ఇది నోవాహు గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యము. మరి మన గురించి దేవుడు ఇచ్చు సాక్ష్యము ఎటువంటిది? ప్రతిరోజూ మనము దేవుని మాట వింటూ ఆయన మాటకి విధేయుడిగా ఉంటున్నామా? తన కొరకు వెదకు ప్రజల కోసం దేవుడు ఎల్లప్పుడూ చూచుచున్నాడు (కీర్తనలు 14:2, 53:2). మత్తయి సువార్త 24:37 లో నోవాహు దినములు ఏలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును అని యేసు చెప్పెను. అంత్యదినములు నోవాహు దినముల వలెనే ఉండును. మానవుని తలంపులు చెడ్డవిగా మారి, మానవులు చెడు గా మార్పు చెందుతారు. ఇటువంటి అంత్య దినములలో నోవాహు దేవుని వెదకినట్టు మనము కూడా దేవుని తో నడుస్తున్నామా? దేవుని వాక్యమునకు వ్యతిరేఖమైన ఆలోచనలను ఈరోజు నుండి వదిలిపెడదాం. దేవుని ఆత్మ ఎల్లప్పుడూ శరీరమునకు వ్యతిరేఖము అని దేవుని వాక్యము చెబుతుంది. కావునా చూపు వలన కాకుండా విశ్వాస మూలంగా ఆత్మననుసరించి నడుచుకొందాం. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యం (హెబ్రీయులకు 11:6). మరియు వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును (రోమీయులకు 10:17). కాబట్టి ఈరోజు నుండి ప్రతి విషయములోను దేవుని మాట వింటూ ఆయన మాటకు విదేయులుగా ఉందాం.

ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. కీర్తనలు 119:2
దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక!

Follow my blog with Bloglovin

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *