ఒక కుటుంబములో తండ్రి యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. కుటుంబము ఆరోగ్యకరంగా, ఆనందముగా ఉండాలన్నా లేక అనారోగ్యకరముగా, విషాదముగా ఉండాలన్నా అది కుటుంబములో ఉన్న తండ్రి యొక్క పాత్ర మీద ఆధారపడి ఉంటుంది. ఈ లోకములో చాలామంది పిల్లలకు వారి తండ్రి ఒక హీరో, శక్తిమంతుడు, తెలివైనవాడు, ఆదర్శవంతుడు, స్ఫూర్తి నింపేవాడు, రక్షణ కల్పించేవాడు. కానీ, ఈ రోజుల్లో ఉన్న కొన్ని మీడియా, పుస్తకాలు, సినిమాలు, ఉన్నతమైన తండ్రి పాత్రను ఒక తెలివి లేనివాడిగా, ఒక ఓడిపోయినవాడిగా, రాజీపడినవాడిగా చిత్రీకరిస్తున్నాయి.
నా జీవితములో కూడా చిన్నప్పటి నుండి, మా నాన్నే హీరో. ఆయన దగ్గర నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నా చిన్నప్పుడు కొన్నిసార్లు ఇంట్లో తినటానికి లేకపోయినా ఆయన కుటుంబము కోసం ఏ విధముగా కష్టపడేవారో నాకు గుర్తుంది. తినటానికి కొంచెం ఉన్నా, ఏ రోజూ కూడా మమ్మల్ని ఆకలితో పడుకోనీయలేదు. ఉన్నంతలో ఎలా ఉండాలో మాకు నేర్పించారు. మనకు ఉన్నంతలో మిగిలిన వారితో ఎలా పంచుకోవాలో నేర్పించారు. మన పరిధిలో ఎలా జీవించాలో నేర్పించారు. అన్నిటికంటే ముఖ్యముగా ఆయన మమ్మల్ని ఎంతో ప్రేమించారు. కుటుంబములో పిల్లలకు కావాల్సిన పోషణ, రక్షణ, క్రమశిక్షణ, మరియు ప్రేమ అందిచవలసిన భాధ్యత తండ్రి పై ఉంది. పిల్లలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడటం కూడా తండ్రి యొక్క బాధ్యత.
కొత్త నిబంధన గ్రంధములో పిల్లలను పెంచటము గురించి చాలా చోట్ల చెప్పడం జరిగినది.
ఎఫెసీయులకు 6:4
4తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.
కొలొస్సయులకు 3:21
21తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి.
పిల్లలకు కోపము రేపవద్దు అని ఇక్కడ ఉంది. వారికి తండ్రి ప్రేమను పంచాలి, వారితో కలిసి ఆదుకోవాలి, వారితో మాట్లాడటానికి ప్రతిరోజు సమయం కేటాయించాలి, వారు తప్పు చేసినపుడు సరిచేయాలి. అంతే కాకుండా వారిని ప్రభువు మార్గములో నడిపించాలి. ప్రతిరోజు బైబిలు ధ్యానము చేయటము, యేసు క్రీస్తు గురించి, దేవుని గురించి వారికి చెప్పడము, దేవుని ఆరాధించటము వారికి నేర్పించాలి.
కుటుంబములో తండ్రి ఉండటము చాలా ముఖ్యమైనది. చాలామందికి ఈ లోకములో తండ్రి ఉన్నారు. కొంతమందికి వివిధ కారణాలవలన తండ్రి లేకపోవచ్చు. కానీ ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక తండ్రి ఉన్నారు. ఆయనే దేవుడు, పరలోకపు తండ్రి. దేవుడు ఒక సృష్టి కర్త మాత్రమే కాదు, ఆయన మనకు తండ్రి కూడా. పరిశుద్ధగ్రంధములో చాలా చోట్ల దేవుని యొక్క తండ్రి లక్షణములు గురించి వ్రాయబడినది. ఆయన మనలను ఏ విధముగా ప్రేమిస్తారో, పోషిస్తున్నారో, రక్షిస్తున్నారో, క్రమశిక్షణలో పెడుతున్నారో చాలా చోట్ల వ్రాయబడినది.
ఒకసారి యేసు క్రీస్తును శిష్యులు, ప్రార్ధన ఏ విధముగా చేయాలో నేర్పించమని అడిగారు. అప్పుడు యేసు వారికి ప్రార్ధన నేర్పించారు. ఆ ప్రార్ధన ఇలా మొదలవుతుంది, “పరలోకమునందున్న మా తండ్రీ.. !” ఈ ప్రార్ధనలో మనము ఆ దేవుడిని తండ్రిగా పోషించమని, రక్షించమని, క్షమించమని, యేసు లా మనల్ని మార్చమని వేడుకుంటాము.
మత్తయి 7:10,11 లో ఇలా వ్రాయబడినది,
10మీరు చెడ్డ వారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్య నెరిగి యుండగా
11పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యీవుల నిచ్చును.
తనను అడుగువారికి పరలోకమునందున్న తండ్రి ఎంతో నిశ్చయముగా యీవులు (బహుమతులు) ఇచ్చును.
కీర్తనలు 91:4
4ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది.
దేవుడు తన బిడ్డలను తన రెక్కలతో కప్పును, ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలిగించును. ఆయన ఒక తండ్రి వలే మనలను పోషిస్తున్నారు. దేవుడు మనల్ని తండ్రి వలె ప్రేమిస్తున్నారని ఆధారం ఏమిటి? సమాధానం యేసు క్రీస్తు.
యోహాను 3:16
16దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా3 పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
దేవుడు మనల్ని ఎంతో ప్రేమించెను గనుక ఆయన యొక్క అద్వితీయ కుమారుడైన యేసు ను మనకు అనుగ్రహించెను. మనల్ని పాపము యొక్క బానిసత్వమును నుండి రక్షించడానికి, మనకు నూతన జీవమును ఇవ్వడానికి ఆయన తన కుమారుని బలి ఇచ్చెను.
మనకు ఇక్కడ ప్రశ్న ఏంటంటే, దేవుడిని మనము తండ్రిగా ఎరుగుదుమా? దేవుడిని మన తండ్రిగా తెలుసుకున్నప్పుడే ఆయనతో మనకు ప్రతిరోజు ఎక్కువ బంధము పెరుగుతుంది. దేవుడిని తండ్రిగా తెలుసుకోవాలంటే అది క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యము. బైబిలులో ఒక చోట “మీరు నన్ను చూచినట్లయితే తండ్రి ని చూచినట్లే” అని. మనకు యేసు క్రీస్తు తెలుసా? మనము యేసులో జీవిస్తున్నామా ?
మనము ఒక మంచి తండ్రిగా ఉండాలంటే, దేవుడే మనకు సహాయము చేయగలరు, దేవుడు మాత్రమే మనకు ఎలా ఉండాలో నేర్పగలరు. చాలాసార్లు తండ్రిగా మనము ఓడిపోయి ఉండవచ్చు, కానీ మనము దేవుడిని నుండి మన తప్పులకు క్షమాపణను, మంచి తండ్రి గా ఉండటానికి కావాల్సిన శక్తిని, ప్రోత్సాహమును పొందుకోవాలి. చేసిన తప్పులు మరల చేయకుండా మనకు శక్తిని దయచేయమని దేవుడిని వేడుకోవాలి. బైబిలులో చాలా మంది తండ్రుల గురించి వ్రాయబడినది. కొంతమంది తండ్రిగా విజయం సాధించారు, మరికొంతమంది తండ్రి గా ఓడిపోయారు. మనము వారి జీవితాలనుండి నేర్చుకోవాలి.
మీరు తండ్రి గా మీ పిల్లలను దేవుని మార్గములో పెంచడానికి కష్టపడుతుంటే ఈరోజే పరలోకపు తండ్రికి మీ జీవితాన్ని సమర్పించుకోండి. ఆయన తండ్రిగా ఎలా ఉండాలో మీకు నేర్పిస్తారు. మీరు ఒక బిడ్డగా మీ తండ్రి తో కష్టమైన సంబంధాన్ని కలిగివున్నా, ఒకవేళ మీ జీవితములో తండ్రిని కోల్పోయినా ఆ దేవుడే మీ తండ్రి. ఆయన మీ రక్షణ, పోషణ, ప్రేమ, క్రమశిక్షణ చూసుకుంటారు.