డిసెంబరు నెల రాగానే క్రిస్మస్ పండుగ హడావుడి ప్రతి చోట మొదలవుతుంది. ఇంటికి నక్షత్రాలు వ్రేలాడుతాయి. ఇంట్లో క్రిస్మస్ చెట్లు వెలుస్తాయి. రాత్రి వేళల్లో వీధుల్లో యువతీ యువకుల క్రిస్మస్ పాటలు. బహుమతులు ఇచ్చే క్రిస్మస్ తాత కోసం వేచిచూసే పిల్లలు. ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉంటాయి. కానీ ఇవన్నీ ఎంత వరకు దేవునికి మహిమ కలిగిస్తున్నాయో మనం ఆలోచించాలి. క్రిస్మస్ పండుగ ఇలా చేసుకోవాలి అని బైబిల్ లో ఎక్కడా ఎవరూ చెప్పలేదు. యేసు ప్రభువు కూడా ఎప్పుడూ చెప్పలేదు. కానీ మన రక్షకుడు ప్రభువు అయిన యేసు క్రీస్తు ప్రభువు వారి జన్మదినం మనకి పండుగ వంటిది అని అందరూ క్రిస్మస్ చేసుకుంటారు.
యేసు క్రీస్తు గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది. కానీ యేసు క్రీస్తు ప్రభువుకు మనం తెలుసా? క్రిస్మస్ అంటే ఏమిటి? ఆయనకు మనము తెలియాలంటే ఏమి చేయాలో ఈరోజు తెలుసుకుందాం. ఈ రోజు రెండు విషయాలు తెలుసుకుందాం
- యేసు క్రీస్తు ప్రభువు ఎందుకు మానవునిగా జన్మించారు? ఆయన జన్మ యొక్క ఉద్దేశ్యము ఏమిటి?’
- ఆయన యొక్క జననము మనకు ఎందుకు ప్రాముఖ్యమైనది? లేదా మనము ఏమి చేయాలి?
మత్తయి 9:9-13
9యేసు అక్కడనుండి వెళ్లుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న మత్తయి అను ఒక మనుష్యుని చూచినన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. 10ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండియుండగా ఇదిగో సుంకరులును పాపులును అనేకులు వచ్చి ఆయనయొద్దను ఆయన శిష్యులయొద్దను కూర్చుండిరి. 11పరిసయ్యులు అది చూచిమీ బోధకుడు సుంకరులతోను పాపులతోను కలిసి యెందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులనడిగిరి. 12ఆయన ఆ మాటవినిరోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యు డక్కరలేదు గదా. 13అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుకకనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని చెప్పెను.
పాపము మనల్ని దేవుడిని వేరుచేసింది. మన పాపము దేవునితో మనకు గల సంబంధాన్ని తెంచి వేసింది. రోమా పత్రికలో ఇలా వ్రాసి ఉంది, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోవుచున్నాము. మనందరము పాపులమే. మనందరం దేవుని దేవుని మహిమను కోల్పోయాం. పాపమునకు జీతము మరణము. మనలో పాపము ఉండి యేసు క్రీస్తు మనలో లేకపోతే మనం భౌతికంగా జీవించి ఉన్నా చనిపోయినట్లే.
కానీ మహోన్నతుడైన, దయగల మన దేవుడు మనం నశించిపోవడం ఇష్టం లేక తన కుమారుని మన కోసం ఈ లోకమునకు పంపెను.
యోహాను 3:16
16దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
ఆయనను విశ్వసిస్తే మనకు మరణము నుండి నిత్య జీవమును కలుగుతుంది. పాపము నుండి మనల్ని విముక్తుల్ని చేయుటకు, దేవునితో మన సంబంధాన్ని పునరుద్ధరించడానికి యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. మన పాపములకు మనము అనుభవించవలసిన శిక్షను ఆయను అనుభవించాడు. తన ప్రాణమును బలిగా అర్పించారు. అందువలన మనకోసం తన జీవితాన్ని అర్పించిన యేసు యందు విశ్వాసముంచితే పాప క్షమాపణ, దేవునితో నిత్య జీవితము మనకు కలుగుతాయి.
మన కోసం ఆయన ఎందుకు చనిపోయారు? మనం చాలా మంచి వారిగా ఉన్నామా? మనం మంచి పనులు చేస్తున్నాం కాబట్టి మన కోసం ఆయన చనిపోయారా? క్రైస్తవ కుటుంబములో పుట్టాం కాబట్టి ఆయన మన కోసం చనిపోయారా? లేదు. మనము పాపులుగా, బలహీనులుగా, దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడు ఆయన చనిపోయి, దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచునట్లు చేసెను. ఆయన మన కోసం చనిపోయారు ఇది బాగానే ఉంది. కానీ ఇప్పుడు మనం ఏమి చేయాలి? రోగం ఉన్నవాడికే డాక్టరు కావాలి. పాపము ఉన్నవారికి రక్షకుడు కావాలి. మత్తయి సువార్తలో దేవుని దూత యేసు జననము గురించి చెబుతూ “ప్రజలను పాపముల నుండి రక్షించడానికి వస్తున్నారు కాబట్టి అతనికి యేసు అని పేరు పెట్టమన్నారు. యేసు అనగా రక్షకుడు అని అర్ధం. యేసు మనల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు. మనం చేయవలసినవి ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయి.
- మనము పాపులము అని గుర్తించాలి. పాపమును గుర్తించాలి. మనకు రక్షకుడు అవసరం అని గుర్తించాలి.
- మనము ఆయనను విశ్వసించాలి. విశ్వసిస్తే పాపములకు క్షమాపణ, ఆయన రక్తము ద్వారా మన పాపములు శుద్ధి కలుగుతుంది.
- మనము పశ్చాత్తాపము లేదా మారు మనస్సు పొందాలి. పాతదైన పాప స్వభావమును విడచి దేవుడిచ్చిన నూతన హృదయముతో, నూతన స్వభావముతో జీవించాలి.
ఇక్కడ మనం 2 రాజులులో జరిగిన ఒక కథను గుర్తు చేసుకుందాం.
2 రాజులు 5
1సిరియారాజు సైన్యాధిపతియైన నయమాను అను నొక డుండెను. అతనిచేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి యుండెను గనుక అతడు తన యజ మానుని దృష్టికి ఘనుడై దయపొందినవాడాయెను. అతడు మహా పరాక్రమశాలియై యుండెను గాని అతడు కుష్ఠ రోగి. 2సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రా యేలు దేశముమీదికి పోయి యుండిరి. వారచ్చటనుండి యొక చిన్నదాని చెరగొని తేగా, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. 3అదిషోమ్రో నులోనున్న ప్రవక్తదగ్గర నా యేలినవాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను; అతడు నా యేలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగుచేయునని తన యజమానురాలితో అనెను. 4నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా 5సిరియా రాజునేను ఇశ్రాయేలు రాజునకు దూతచేత పత్రిక పంపించెదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు ఇరువది మణుగుల వెండియు లక్ష యిరువది వేల రూపాయిల బంగారును పది దుస్తుల బట్టలను తీసికొని పోయి ఇశ్రా యేలురాజునకు పత్రికను అప్పగించెను. 6ఆ పత్రికలో ఉన్న సంగతి యేదనగానా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగుచేయవలెనని యీ పత్రికను అతనిచేత నీకు పంపించి యున్నాను. 7ఇశ్రాయేలురాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొనిచంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నాయొద్దకు ఇతడు పంపుటయేమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదకుచున్నాడో మీరు ఆలోచించుడనెను. 8ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడునీ వస్త్ర ములు నీ వెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త యొకడున్నాడని అతనికి తెలియబడునట్లు అతని నాయొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను. 9నయమాను గుఱ్ఱములతోను రథముతోను వచ్చి ఎలీషా యింటి ద్వారము ముందర నిలిచియుండగా 10ఎలీషానీవు యొర్దానునదికి పోయి యేడు మారులు స్నానము చేయుము, నీ ఒళ్లు మరల బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. 11అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగి పోయి యిట్లనెను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి,తన దేవుడైన యెహోవా నామ మునుబట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలముమీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేననుకొంటిని. 12దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటె శ్రేష్ఠమైనవి కావా? వాటిలో స్నానముచేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్లిపోయెను. 13అయితే అతని దాసులలో ఒకడు వచ్చినాయనా, ఆ ప్రవక్త యేదైన నొక గొప్ప కార్యము చేయుమని నియమించినయెడల నీవు చేయ కుందువా? అయితే స్నానముచేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటె మేలుకాదా అని చెప్పినప్పుడు 14అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో ఏడు మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహమువలెనై అతడు శుద్ధుడాయెను. 15అప్పుడతడు తన పరివారముతోకూడ దైవజనునిదగ్గరకు తిరిగివచ్చి అతని ముందర నిలిచిచిత్త గించుము; ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోక మంతటియందును మరియొక దేవుడు లేడని నేను ఎరుగు దును;
మొదటిది నమాను తనకు కుష్టు ఉంది అని గుర్తించాడు. రెండవది ఎలిషా చెప్పిన నదిలో 7 సార్లు మునిగి తేలితే స్వస్థత కలుగుతుంది అని విశ్వసించాడు. మూడవది తను మారు మనస్సు పొంది ఎలిషా తో “మీ దేవుడే నిజమైన దేవుడు” అని సాక్ష్యమిచ్చాడు. ఈ కథలో చెప్పిన నది యేసు క్రీస్తుతో సమానం. ఆ జీవనది యొద్దకు వచ్చి విశ్వసించి దేవుడు అనుగ్రహించిన నిత్య జీవితమును మనందరం పొందుకోవాలి. పాపము కుష్టు వ్యాధితో సమానము. పైన చెప్పిన మూడు విషయాలు మనము గ్రహించి ఈ భయంకరమైన వ్యాధి నివారణకు దేవుడు ప్రసాదించినటువంటి, యేసు క్రీస్తు సిలువ పై చేసిన ఆ మహత్కార్యమును నమ్మితే మనము రక్షించబడతాం.
మన జీవితం లేదా ప్రాణం చాలా సున్నితమైనది. మానవుని జీవితము గురించి దేవుడు బైబిలులో చాలా విధాలుగా పోల్చారు. మన ప్రాణము నీటియావిరి వంటిది(యోహాను 4), గడ్డి వంటిది(కేర్తనలు 108). ఊపిరి వంటిది(కేర్తనలు 144).
మన జీవితము ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేరు. హెబ్రీ గ్రంధములో ఇలా వ్రాసి ఉంది. మానవునికి మరణము ఒక్కసారే నియమించబడినది తరువాత తీర్పు. ఆ రోజు మనందరమూ దేవుని ముందు నిలబడాలి. యేసు క్రీస్తు మనలో లేకపోతే మన పాపములకు తగిన శిక్ష నిత్యము మనము అనుభవించాల్సిందే. యేసును విశ్వసిన్చియుంటే దేవుని తో నిత్యము జీవించే అవకాశం కలుగుతుంది. ఏది కావాలో మనం ఇక్కడే నిర్ణయించుకోవాలి.
మనలో ఎవరైనా పాపభారమును మోస్తున్నట్లయితే ఈరోజే యేసు వద్దకు వెళదాం. ఆయనను నమ్మి, పాప క్షమాపణ పొంది క్రీస్తులో క్రొత్త జీవితమును ప్రారంభిద్దాం. చాలా మంది తమలో ఏ పాపము లేదు అని అంటారు. మనలో పాపము లేదు అంటే మనము దేవుడిని అబద్దికుడిని చేస్తున్నట్లే అని దేవుని వాక్యము చెబుతుంది. పాపము అంటే ఏదో హత్య, పెద్ద దొంగతనమో, ఏదో అత్యాచారమో మాత్రమే కాదు. మన హృదయము చాలా మోసకరమైనది. మన హృదయములో చెడ్డ ఆశలు, మనస్సులో చెడ్డ తలంపులు, మనము చెప్పే చిన్న చిన్న అబద్దాలు, ఎవరి మీదైనా ద్వేషము, అసూయ, పగ, కోపము, గర్వము, ఇతరులను క్షమించకపోవడం, ఇలాంటివన్నీ దేవుని దృష్టిలో పాపములే. దేవునికి ఇష్టము లేనిది ఏదైనా పాపమే. మనము పాపములు చేయటం వలన పాపులము కాలేదు. మనము పాపులగా పుట్టాము కాబట్టే మనము పాపపు పనులు చేస్తున్నాం. ఇటువంటి పాప భారము మీరు మోస్తున్నట్లయితే ఈరోజే ఆయన వద్దకు వచ్చి ఆయనకు మీ భారమును అప్పగించండి. ఆయన మీకు విశ్రాంతి కలుగజేయును.
మత్తయి 11:28-30
28ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. 29నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. 30ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.
ఒక దేవుని సేవకుడు ఒక కథ చెప్పారు. ఒక ఊళ్ళో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఇతడికి పెయింటింగ్స్ అంటీ చాలా ఇష్టం. అతనికి ఇష్టమైన పెయింటింగ్స్ సేకరించి ఒక మ్యూజియం కట్టించాడు. అతడికి ఒక కుమారుడు ఉన్నాడు. ఈ కుమారుడు, వారి ఇంటి బయట ఉంటున్న ఒక అడుక్కునే వాడిని రోజూ చూస్తూ ఉండేవాడు. ఒకరోజు అతడితో మాట్లాడి క్రమంగా వారు స్నేహితులు అయ్యారు. ఒక రోజు అడుక్కునేవాడు ఈ కుమారుని పెయింటింగ్ వేసి అతడికి బహుమతిగా ఇచ్చాడు. కుమారుడు ఎంతో సంతోషించి తన తండ్రికి ఆ పెయింటింగ్ చూపించి వారి మ్యూజియంలో ఆ పెయింటింగ్ పెడతారు. కొన్ని రోజుల తరువాత కుమారుడు ఈ అడుక్కునేవాడి దగ్గరకు రావడం మానేస్తాడు. ఏమైందో తెలుసుకోవడానికి ఈ అడుక్కునేవాడు కుమారుని ఇంటికి వస్తాడు. ఆ కుమారుడు జబ్బు చేసి చనిపోయాడు అని తెలుసుకుని చాలా బాధ పడతాడు. ఆ కుమారుని పెయింటింగ్ మరొకటి వేసి ఆ తండ్రికి తన గుర్తుగా ఇస్తాడు. మరికొన్ని రోజుల తరువాత ఆ తండ్రి కూడా జబ్బు చేసి చనిపోయాడని అడుక్కునే వాడు తెలుసుకుంటాడు. వారి అస్తి, మ్యుజియంలకు వారసులు ఎవరూ లేరు కనుక అధికారులు వాటిని వేలం పాట పెట్టారు. ఈ అడుక్కునేవాడు వాడు కూడా అక్కడికి వెళతాడు. వేలంలో మొదటిగా ఈ అడుక్కునేవాడు వేసిన రెండు పెయింటింగ్స్ అధికారులు వేలంలో పెట్టారు. కానీ అవి అంతగా బాగాలేవు గనుక ఎవరూ వాటిని తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. మిగిలిన వాటిని వేలం వేయమని అందరు అడుగుతున్నారు. తండ్రి తన వీలునామా లో ఈ రెండు పెయింటింగ్స్ ముందు వేలం వేయాలని వ్రాసాడు. కాబట్టి అధికారులు కూడా ఎవరో ఒకరికి ఈ పెయింటింగ్స్ ఎంత తక్కువ ధరకైనా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఈ అడుక్కునేవాడు తన దగ్గర ఉన్న రెండు, మూడు నాణెములు చెల్లించి తాను వేసిన ఆ పెయింటింగ్స్ కొనుక్కుంటాడు. అందరూ కూడా సంతోషించి మిగిలిన అద్భుతమైన పెయింటింగ్స్ కొనుక్కోవడానికి సిద్ధపడతారు.
అప్పుడు ఆ అధికారులు, “అందరూ వెళ్ళవచ్చు, వేలం పాట అయిపొయింది.”
“అదేంటి? ఇంకా పెయింటింగ్స్ ఉన్నాయి కదా!” అందరూ అడిగారు ఆశ్చర్యంగా.
వెంటనే ఆ అధికారులు రెండు పెయింటింగ్స్ కొన్న ఆ అడుక్కునేవాడిని వెనక్కి పిలచి ఆ మ్యుజియం అంతా ఆయనకే చెందుతుంది అని చెబుతారు.
“ఇదేంటి? ” అని అందరూ అధికారులను అడుగుతారు కోపంగా.
ఆప్పుడు అధికారులు ఆ తండ్రి వీలునామాను చదువుతారు. ” ఎవరైతే మొదటిగా నా కుమారుని పెయింటింగ్స్ కొంటారో వారికి మొత్తం ఆస్తి చెందుతుంది”.
అడుక్కునేవాడు ఆనందిస్తే ఆశ్చర్యపోవడం అందరి వంతవుతుంది.
పై కథలో చెప్పిన విధంగా దేవుని కుమారుడు మనలో ఉంటే, పరలోకములో మన తండ్రి మన కోసం సిద్ధం చేస్తున్న నిత్య జీవితము మనకే చెందుతుంది. మను విశ్వసిస్తే దేవుని కుమారునిలో జీవము ఉంది, విశ్రాంతి ఉంది, పాప విమోచన ఉంది, నిత్య జీవితము ఉంది.