ఫిలిప్పీయులకు 3:18
అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు; వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి యిప్పుడును ఏడ్చుచు చెప్పు చున్నాను.
క్రీస్తు సిలువకు శత్రువులను రెండు గుంపులుగా విభజిస్తే, ఒక గుంపు ప్రజలు యేసు క్రీస్తును నమ్మని అవిశ్వాసులు. రెండవ భాగము ప్రజలు క్రైస్తవులు. మన పాపములను బట్టి యేసు క్రీస్తు సిలువపై చనిపోయి మూడవ దినమున తిరిగి లేచారని అవిశ్వాసులు నమ్మరు. కానీ కొంతమంది క్రైస్తవులు యేసు క్రీస్తును నమ్ముతారు, వారి పాపములకు క్షమాపణ పొంది, రక్షణ పొందుతారు. కానీ వారు ఆ రక్షణలో విశ్వాసముతో నడవరు. క్రీస్తు సిలువకు శత్రువుల యొక్క దేవుడు వారి కడుపే. వారు భూసంబంధమైన వాటి యందే మనస్సుంచుచున్నారు(ఫిలిప్పీయులకు 3:19,20). దేవుని బిడ్డలుగా మనము పరలోక సంబంధమైన వాటి యందు మనస్సుంచాలి. క్షయమైన ఆహారముకొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగ జేయు అక్షయమైన ఆహారముకొరకే కష్టపడుడి; మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను. అని యేసు క్రీస్తు యోహాను సువార్త 6:27 లో చెప్పెను. 38 వ వచనములో నా యిష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని అని యేసు ప్రభువు అంటున్నారు. మనము కూడా ఆత్మ మూలముగా పై నుండి జన్మించిన వారము. దేవుని చిత్తము కాకుండా మన చిత్తము ప్రకారం జీవిస్తే క్రీస్తు సిలువకు మనం శత్రువులుగా అవుతాం. వారి అంతము నాశనమే. తమ చిత్త ప్రకారం నడుచుకుని దేవునికి అబద్ధం చెప్పిన అననీయ మరియు సప్పీరా ల అంతము మరణమే( అపోస్తుల కార్యములు 5:1-11). మనము కూడా క్రీస్తు సిలువకు శత్రువులుగా జీవిస్తున్నామా? మన చిత్త ప్రకారం నడుస్తున్నామా? లేదా దేవుని చిత్త ప్రకారం నడుస్తున్నామా? మనల్ని ప్రశ్నించుకోవాలి. ఫిలిప్పీయులకు 2 :12 లో చెప్పినట్లు మనము భయముతోను, వణకుతోను మన సొంత రక్షణను కొనసాగించుకోవాలి.