త్యాగం యొక్క చిహ్నం: యేసు క్రీస్తు శిలువ

నేను ఈరోజు ఒక సాక్ష్యంతో ఈ సందేశము ప్రారంభించాలనుకుంటున్నాను. నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టి పెరిగాను మరియు నా తల్లిదండ్రులు మరియు బంధువులు అందరూ ఆ సమయంలో హిందువులే. దేవుని యొక్క కృపను బట్టి, వివిధ వ్యసనాలతో, పాపములో ఉన్న నన్ను దేవుడు రక్షించడానికి, నా జీవితంలో కొన్ని పరిస్థితులను సృష్టించాడు. అప్పుడు నేను సువార్త విన్నాను మరియు యేసుక్రీస్తును నా ప్రభువుగా మరియు రక్షకుడిగా స్వీకరించి విమోచన పొందాను. కానీ, సాక్ష్యం నా గురించి కాదు, మా నాన్న గురించి. 

నేను క్రీస్తును అంగీకరించిన తర్వాత, నా తల్లిదండ్రులు నన్ను వ్యతిరేకించడం జరిగింది. మరియు వారు నా విశ్వాసాన్ని అంగీకరించలేదు. నేను వారి రక్షణ కోసం పగలు మరియు రాత్రి ప్రార్ధించాను. వారు రక్షణ పొందుకోవాలని, వారికి క్రీస్తు, రక్షణ మొదలైన వాటి గురించి అనేక సార్లు వారికి చెప్పారు. వేలకొద్దీ దేవుళ్లలో యేసును దేవుళ్లలో ఒకరిగా అంగీకరించడానికి వారు అంగీకరించారు. కానీ, వారు నిజమైన సువార్తను మరియు యేసుక్రీస్తును ఎన్నడూ అర్థం చేసుకోలేదు. 

చివరగా, 5 సంవత్సరాల తరువాత, మా నాన్న నాకు ఒకసారి ఫోన్ చేసి, ఇప్పుడు నేను యేసుక్రీస్తు మాత్రమే ప్రభువు అని నమ్ముతున్నాను, నేను త్వరలో బాప్తీస్మం  పొందబోతున్నాను అని చెప్పారు. ఆహా ఇది అధ్బుతం. అది విన్నప్పుడు నేను ఎంత ఆనందముతో, కృతజ్ఞతతో ఉన్నానో మాటల్లో చెప్పలేను. చివరకు నా సువార్త పంచుకోవడం బాగానే పనిచేసింది అనుకున్నాను. బాప్తిస్మం తీసుకున్న తర్వాత నేను వారిని కలిసినప్పుడు , నేను మా నాన్నను అడిగాను, మీరు యేసును విశ్వసించడానికి కారణం ఏంటి అని? నేను సువార్త చెప్పడంవల్లే అంటారు అని మనసులో అనుకుంటూ. అప్పుడు మా నాన్న ఇలా సమాధానం ఇచ్చారు. “నా జీవితమంతా నేను హిందువుగా జీవించాను మరియు వివిధ దేవుళ్లను ఆరాధించాను. మా నాన్న చెప్పారని, సమాజం చెప్పిందని అలా చేశాను. నా జీవితం, ఇంకా విశ్వాసం, ఇవన్నీ మన సమాజం మరియు సంస్కృతి నాపై చూపిన ప్రభావం మీద ఆధారపడింది. అయితే ఎప్పుడైతే నువ్వు యేసును విశ్వసించావో, అప్పటినుండి  సమాజం, మన బంధువులు నాతో భిన్నంగా ప్రవర్తించడం ప్రారంభించారు. నేను వారి మతాన్ని అనుసరిస్తున్నా కూడా, వారు మాతో మాట్లాడటం లేదు, మమ్మల్ని దేనికి ఆహ్వానించడం లేదు, మమ్మల్ని కించపరచడం మొదలుపెట్టారు.  అయితే నేను మీ ఇంటినకి వచ్చినప్పుడు, ఇతర క్రైస్తవ గృహాలను సందర్శించినప్పుడు, ఆ ఇళ్లల్లో చాలా ప్రేమ, ఆనందం ఉన్నాయి. అక్కడ వాతావరణం అంతా భిన్నంగా ఉంటుంది, వారి భావజాలాలు ఉదాత్తమైనవి, వారిలో అసూయలు లేవు, కానీ నాకు చాలా ప్రియమైనవారిగా నేను భావించిన బంధువులు దీనికి విరుద్ధంగా ఉన్నారు. కాబట్టి, నేను ఆలోచించడం మొదలుపెట్టాను, క్రైస్తవులలో ఏదో తేడా ఉంది.

 అది ప్రేమ అని తెలుసుకున్నాను. అప్పుడు నేను ఆ ప్రేమను కోరుకున్నాను, వారిలో ఆ ప్రేమను ఉండేలా చేసిన దేవుణ్ణి తెలుసుకోవాలనుకున్నాను. చివరగా, నేను యేసుక్రీస్తు శిలువ వద్దకు వచ్చాను, అక్కడ దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ వ్యక్తీకరించబడింది అని తెలుసుకున్నాను. యేసును నా ప్రభువుగా రక్షకునిగా స్వీకరించాను” అని మా నాన్న తన సాక్ష్యాన్ని ముగించారు. 

మిత్రులారా, ఈరోజు మనం చూడబోయేది ఇదే. యేసు క్రీస్తు యొక్క శిలువ. ఇది దేవుని అపరిమితమైన ప్రేమ మరియు దయకు నిదర్శనం. 

“దేవుడు ప్రపంచాన్ని ఎంతగానో ప్రేమించాడు, ఆయన తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు, ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరూ నశించరు, కానీ శాశ్వత జీవితాన్ని పొందుతారు.”

యోహాను  3:16

సిలువ అనేది నీతి మరియు దయ కలిసిన ప్రదేశం, ఇక్కడ పాపరహితమైన క్రీస్తు, లోకంలోని అందరి పాపాలను తనపైకి వేసుకున్నాడు. ఇక్కడే మన పాప పరిహారార్ధం చెల్లించాల్సిన వెల చెల్లించబడింది. మన పాపములు, అతిక్రమణలు క్షమించబడ్డాయి. యేసు క్రీస్తు శిలువ కేవలం ఆయన పడిన బాధకు చిహ్నం కాదు; అది ఆశాకిరణం, మన విమోచన వాగ్దానం.

సిలువ – చారిత్రాత్మక వివరణ:

రోమన్ల కాలంలో శిలువ శిక్ష మరియు అవమానానికి చిహ్నంగా ఉండేది. అటువంటి శిలువపైనే, మన రక్షకుడు సిలువ వేయబడ్డాడు. చారిత్రాత్మకంగా, రోమన్ శిలువ అనేది ఉరితీసే క్రూరమైన పరికరం, ఇది అత్యంత తీవ్రమైన నేరస్థుల కోసం ప్రత్యేకించబడింది. ఇది నొప్పిని, బాధను పెంచడానికి మరియు ఖండించబడినవారి వేదనను పొడిగించడానికి రూపొందించబడింది. సిలువకు వ్రేలాడదీయబడటానికి ముందు బాధితులు కొరడాలతో కొట్టబడి, చిత్రహింసలకు గురిచేయబడతారు. బాగా హింసించిన తరువాత, వారిని సిలువకు మేకులతో కొట్టి, వ్రేలాడదీసి చంపుతారు. మీ కోసం, నా కోసం, ప్రభువు ఆ శిక్షలు అనుభవించాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, మూళ్ళ కిరీటం ధరించాడు, రక్తం చిందించాడు. అది దేవుని యొక్క గొప్ప ప్రేమకు నిదర్శనం. 

సిలువ – మార్పుకు చిహ్నం

యేసు క్రీస్తును సిలువ వేసినవారు, అక్కడి ప్రజలు సిలువ మరణానికి చిహ్నం అనుకున్నారు, అయితే మనల్ని రక్షించటానికి, పాపములో చనిపోయిన మనల్ని జీవింపచేయడానికి దేవుడు ఏర్పరచిన సిలువ జీవమునకు చిహ్నము. అప్పుడు ఓటమికి సంకేతమైనదిగా ఉన్న శిలువ, విజయంగా రూపాంతరం చెందింది. సిలువ ద్వారా, యేసు మన పాపాల బరువును భరించాడు మరియు మనకు నిత్యజీవం యొక్క వాగ్దానాన్ని అందించాడు. 

ఆయన  పునరుత్థానం సిలువను మన నిరీక్షణ యొక్క వెలుగుగా మార్చింది, మరణం కూడా మన పట్ల దేవుని యొక్క ప్రేమను జయించలేదని గుర్తు చేసింది.

క్రైస్తవ మతానికి శిలువ చాలా ప్రధానమైనది. ఇది సువార్త యొక్క హృదయాన్ని సూచిస్తుంది – మన పాపాలను చెల్లించడానికి యేసుక్రీస్తు సిలువపై మరణించాడనే శుభవార్త. విఛ్చిన్నమైపోయిన మానవ హృదయాలు సిలువ దగ్గరే కట్టబడతాయి. వివిధ పాపములకు, శోధనలకు బానిసైన మానవుడు సిలువయొద్దే విముక్తిని పొందుకొని మార్పు చెందుతాడు. 

సిలువ – ప్రాయశ్చిత్త త్యాగం

సిలువను చూసినప్పుడు, యేసు యొక్క ప్రాయశ్చిత్త మరణం మనకు గుర్తుకు వస్తుంది. అది మన పాపాల కోసం ఆయన చేసిన త్యాగానికి ప్రతీక. పాపం చేయని దేవుని కుమారుడు మన అపరాధం, బాధ మరియు అవమానాన్ని ఇష్టపూర్వకంగా భరించాడు. మానవత్వానికి మరియు దేవునికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి ఆయన రక్తం చిందించబడింది. సిలువ అనేది ప్రేమ మరియు దయ యొక్క అంతిమ వ్యక్తీకరణ.

సిలువ – కొంతమందికి అపార్థం

మొదటి నుండి, శిలువ సందేశం తిరస్కరణ, అపార్థాన్ని ఎదుర్కొంది. 1 కొరింథీయులకు 1:18-25లో, అపొస్తలుడైన పౌలు దీనిని ఎత్తి చూపాడు:

యూదులకు:

“సిలువ వేయబడిన మెస్సయా” అనే ఆలోచన అవివేకంగా అనిపించింది. మెస్సయా కష్టాలు అనుభవించే సేవకుడిగా కాకుండా జయించే రాజుగా వస్తాడని వారు ఎదురుచూసారు. యేసు శిలువపై మరణించడం వారి అంచనాలకు అనుగుణంగా లేదు.

అన్యజనులకు (యూదులు కానివారు):

ప్రపంచంలో గొప్ప పేరు, విలువ, సైనిక శక్తి కలిగిన రోమీయులు, సువార్తను మూర్ఖంగా భావించారు. స్వస్థతలు చేసి, అద్భుతాలు చేసి, మంచి బోధను చేసిన నాయకుడినే సిలువ వేయమన్న వారి బానిస యూదులను చూసి సువార్త మూర్ఖమైందని రోమీయులు అనుకున్నారు. 

క్రీస్తు సిలువను, త్యాగాన్ని, ప్రేమను, కృపను, విమోచన శక్తిని గుర్తించలేని వారు సిలువను అపార్థం చేసుకుంటారు. వారి మనో నేత్రాలు తెరవబడాలని మనం ప్రార్ధించాలి. 

సిలువ – నేర్చుకోవాల్సిన పాఠాలు

సిలువపై యేసుక్రీస్తు ప్రదర్శించిన ప్రేమ, త్యాగం మరియు క్షమాపణ యొక్క సూత్రాలను మనము కూడా మన జీవితాల్లో ఆచరించాలి. అప్పుడే సిలువ సందేశాన్ని మనం అర్ధం చేసుకున్నవారవుతాం. సిలువలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని మార్గాలు:

త్యాగం: యేసు సిలువ త్యాగం ప్రేమ యొక్క అంతిమ చర్య, నిస్వార్థత యొక్క శక్తిని మనకు బోధిస్తుంది. మనము కూడా త్యాగాన్ని కలిగియుండాలి. 

క్షమాపణ: ఎంత పెద్ద పాపమైన క్షమాపణ సాధ్యమని శిలువ మనకు గుర్తు చేస్తుంది. క్రీస్తు తనకు అన్యాయం చేసిన వారిని క్షమించినట్లే, మనం కూడా ఇతరులపట్ల క్షమాపణను కలిగియుండాలి. పగ, ప్రతీకారము, ద్వేషము, ఇటువంటివన్నీ విడిచిపెట్టాలి. 

విముక్తి: సిలువ ద్వారా, మనకు విమోచన కలిగింది. యేసు మనకి విడుదల కలుగచేసారు. మనం కూడా ఇతరుల పట్ల ధాతృత్వం కలిగియుండాలి.  

సేవ: సేవ మరియు దాతృత్వ చర్యలలో నిమగ్నమై, అవసరమైన వారికి సహాయం చేయడం మరియు మాటల్లోనే కాకుండా చర్యలో ప్రేమను చూపడం వంటివి యేసు చేసినట్లే మనం కూడా చేయాలి. 

ప్రేమ: క్రీస్తు మనలను ప్రేమించినట్లే, ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా ఇతరులను బేషరతుగా ప్రేమించండి.

విశ్వసనీయత: యేసు క్రీస్తు ప్రభువు సిలువలో ఆయనకు తండ్రి ఇఛ్చిన పనిని పూర్తిచేశారు. మనము కూడా జీవితంలోని అన్ని అంశాలలో చిత్తశుద్ధి మరియు నిజాయితీతో జీవించడం, చిన్న విషయాలలో కూడా నమ్మకంగా ఉండడం చేయాలి.

సాక్షి: సిలువ సందేశాన్ని మాటల ద్వారానే కాకుండా క్రీస్తు బోధలను ప్రతిబింబించే జీవితం ద్వారా మనము క్రీస్తుకు సాక్షిగా ఉంది ఇతరులతో సువార్తను పంచుకోవాలి.

సిలువ మార్గాన్ని మన జీవితాల్లో అన్వయించుకుని, దేవుని యొక్క ప్రేమను, క్రీస్తుయొక్క కృపను ప్రతిరోజు గుర్తుచేసుకుంటూ, దేవుడిని స్తుతిస్తూ, సువార్తను చాటిచెబుతూ ప్రభువుకు సాక్షులుగా బ్రతుకుదాం. 

దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *