శిలువపై నుండి యేసు క్రీస్తు పలికిన 7 మాటలు

సాధారణంగా మరణించే వ్యక్తి నుండి వచ్చే చివరి మాటలు చాలా ముఖ్యమైనవి. ప్రజలు ఆ చివరి మాటలకు చాలా గౌరవం మరియు ప్రాముఖ్యత ఇస్తారు.  కావాల్సిన వ్యక్తుల చివరి మాటలు వినలేదని కొంతమంది భాదపడటం కూడా చూస్తుంటాం. ఎందుకు ఈ చివరి మాటలు అంత ప్రాముఖ్యమైనవంటే, అవి ఆ వ్యక్తి యొక్క జీవితపు  సారాన్ని క్లుప్తంగా వివరిస్తాయి అంతేకాకుండా మరణించాక ఆ వ్యక్తి నిత్య జీవితంలో ఎక్కడికి చేరొచ్చో కూడా  తెలియజేస్తాయి.

ఈ లోకంలో చాలామంది వారు చనిపోయేముందు వారి జీవితాన్ని సరిచేసుకోవాలి అనుకుంటారు. చనిపోయేముందు వారికి సమయం దొరికితే ఆ  బెడ్ మీదనుండే వారి జీవితములో ఎవరికైనా అపకారం చేస్తే వారిని క్షమాపణ అడగడం, కుటుంబ సభ్యులతో చివరిగా వారి సంబంధాన్ని మెరుగుపరచుకోవడం చేస్తుంటారు. కానీ మనలో చాలా మందికి అటువంటి అవకాశం రాదు. ఎందుకంటే మనం ఎప్పుడు మరణిస్తామో, ఎలా మరణిస్తామో మన చేతుల్లో లేదు. అందుకే చివరి మాటలు వినే అవకాశము వస్తే, వాటికి ప్రజలు అంత ప్రాముఖ్యత ఇస్తారు.

చరిత్రలో, కొంతమంది గొప్ప క్రైస్తవులు చనిపోతున్న సమయములో చాలా మంచి మాటలు చెప్పారు. ఉదాహరణకు కింద ఉన్న మాటలు రక్షణవైపునకు ప్రేరేపిస్తాయి.

విలియం కేరీ ( భారతదేశంలో పరిచర్య చేసిన మిషనరీ): “నేను మరణించిన తరువాత, Dr. కేరీ గురించి తక్కువ మాట్లాడండి. Dr. కేరీ గారి రక్షకుని (యేసు క్రీస్తు) గురించి మరింత ఎక్కువగా మాట్లాడండి”. [“When I am gone, speak less of Dr. Carey and more of Dr. Carey”s Savior.” ]

జోనాథన్ ఎడ్వర్డ్స్ : దేవునియందు విశ్వాసము ఉంటే, నీవు భయపడాల్సిన అవసరం లేదు.

మరికొంతమంది దేవుని నమ్మని వారు, చనిపోతూ భయంతో ఈ మాటలు అన్నారు.

కార్డినల్ బోర్గియా: నా జీవితములో బ్రతకడానికి కావాల్సినవన్నీ సమకూర్చుకున్నాను ఒక్క చావుకి తప్ప. అయ్యో! ఇప్పుడు సిద్ధపడకుండానే మరణిస్తున్నాను.

థామస్ హాబ్స్ : అంధకారములోనికి దూకడం ద్వారా నా చివరి ప్రయాణాన్ని మొదలుపెడుతున్నాను..

మనుషుల యొక్క చివరి మాటలకే మనం ఇంత ప్రాధాన్యత ఇస్తుంటే, మానవాళి ముక్తి కొరకు శిలువపై మరణించిన, దేవుని కుమారుడు, లోక రక్షకుడు అయిన యేసు క్రీస్తు వారి యొక్క మాటలకు మనం ఇంకెంత ప్రాధాన్యత ఇవ్వాలి. యేసు క్రీస్తు ప్రభువు సిలువపై మరణించే ముందు పలికిన 7 మాటలు ఎంతో ముఖ్యమైనవి. ఈ మాటలు ఆయన జీవితానికి, ఆయన ఇచ్చిన సందేశానికి, మనయందు ఆయనకి ఉన్న ప్రేమకు నిదర్శనాలు. ఆ సిలువపైన యేసు క్రీస్తు  చేసిన కార్యము, మానవుని యొక్క పాప విమోచనకు, తండ్రియైన దేవునికి మరియు పాపులైన మానవులకు మధ్య సంబంధాన్ని బాగు చేయడానికి ఎంతో ముఖ్యమైంది.

ఆ సిలువపై యేసు క్రీస్తు ప్రభువు పలికిన ఆ 7 మాటలను ఇప్పుడు ధ్యానిద్దాం.

  1.తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను.

లూకా 23:34
యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లువేసిరి.

చరిత్రకారుల ప్రకారం, అన్ని మరణాలలో కెల్లా, శిలువపైన మరణం చాలా భాధాకరమైనది. ఈ శిలువ మరణం భరించలేని హింసతో కూడుకున్నది. అందుకే రోమీయులు దీనిని దోషులను శిక్షించే పద్దతిగా ఎంచుకున్నారు. శిలువ శిక్ష విధించిన వారిని మొదట బట్టలు విప్పి, ప్రత్యేకముగా తాయారు చేసిన ఒక కొరడాతో వారిని దెబ్బలు కొడతారు. ఈ కొరడా తయారు చేయడానికి పదునైన గొర్రె ఎముకలు, పదునైన లోహములు ఉపయోగించేవారు. అటవంటి కొరడాతో దోషుల వీపుపై కొడుతూ ఉంటే, ఆ పదునైన ఎముకలు, లోహములు చర్మాన్ని లోతుగా గుచ్చుకుని, చర్మాన్ని రక్తముతో తొలిచేసేది. అటువంటి భాధలో, హింసలో వున్న వారితోనే శిలువను కూడా మోయిస్తారు. ఆ శిలువ  బరువు సుమారు 50 కిలోలు ఉండొచ్చు. శిలువ వేసే చోటుకి వచ్చిన తరువాత, దోషులని శిలువ పెట్టి వారి చేతులకు, కాళ్లకు మేకులు కొడతారు. ఆ మేకులు కూడా రక్తము ఎక్కువ పోకుండా నరాలు తెగిపోకుండా కొడతారు. ఇలా చేస్తే ఎక్కువ సమయం చనిపోకుండా శిక్షను అనుభవిస్తారని వారు ఇలా చేస్తారు. ఇటువంటి పరిస్థితిలో ఊపిరి తీసుకోవాడికి చాలా కష్టం. ఇటువంటి భయంకర శిక్షను యేసు అనుభవిస్తున్నారు. ఎందుకు? ఆయన ఎటువంటి పాపం చేయలేదు. కానీ మీకోసం, నా కోసం ఆయన మరణించాడు. మన పాపముల యొక్క శిక్షను, మనకు బదులుగా ఆయన అనుభవించాడు.

ఆ కొరడా దెబ్బలు మనం తినాలి, ఆ శిలువపైన మనం ఉండాలి. కానీ మనకు బదులుగా ఆయన ఉన్నాడు. అటువంటి భయంకరమైన బాధలో ఉన్నా కూడా ఆయన ఇంకా మన గురించే ఆలోచిస్తున్నారు.. మనల్ని క్షమించమని పరలోకపు తండ్రిని వేడుకుంటున్నారు..

ఈ మొదటి మాటలో మనము రెండు విషయాలు నేర్చుకోవచ్చు..

క్షమాపణ:- చివరి సమయములో కూడా యేసు క్షమాపణ గురించి బోధిస్తున్నారు. క్షమాపణ ఎంత ముఖ్యమైనదో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఆయన పరిచర్యలో చాలా మంది పాపములను క్షమించారు. ఈ శిలువ మరణం ద్వారా మానవాళి పాప క్షమాపణకు ఆయన మార్గం ఏర్పరచారు. ప్రభువు ప్రార్ధనలో కూడా, యేసు క్షమాపణను గురించి చెబుతారు. ఇతరులను క్షమించటం గురించి అందులో నేర్పిస్తారు. మన జీవితములో క్షమాపణ ఈ విధముగా ఉందో ఆలోచిద్దాం.. ఇతరులను క్షమిస్తున్నామా? అంతే కాకుండా, మీలో ఎవరైనా ఇంకా పాప భారమును మోస్తూ ఉన్నారా? పాప క్షమాపణకు శిలువ వద్దకు రండి.

గ్రహించుట (Knowing):- యేసు ప్రభువును రక్షకునిగా ప్రజలు అప్పుడు అంగీకరించలేదు. ఆయనే మెస్సయా అని, రక్షకుడు అని వారు గ్రహించలేదు. యేసు శిలువ పైన ఉండగా, ఆ మార్గమున వెళ్లువారు నీవు దేవుని కుమారుడివైతే నిన్ను నీవే రక్షించుకో అని దూషించారు. అలాగే శాస్త్రులు, పెద్దలు కూడా ఆయనను అపహసించారు. అంతేకాకుండా యేసుతో పాటు సిలువ వేయబడిన దొంగలు కూడా ఆయనను అలాగే నిందించారు. వాళ్ళందరూ యేసే రక్షకుడని “గ్రహించలేకపోయారు”. వారి నేత్రములు మూయబడినవి. అటువంటి వారికోసము కూడా యేసు క్షమించమని ప్రార్ధించారు. యేసే రక్షకుడని మనము తెలుసుకున్నామా ? మనకోసం యేసు అనుభవించిన శ్రమలు, శిక్షను మనం గ్రహించామా? ద్వితీయోపదేశకాండము 21:23 లో చెప్పిన విధముగా మనకోసం యేసు శాపగ్రస్థుడు అయ్యారు.

ద్వితీయోపదేశకాండము 21:23
అతని శవము రాత్రి వేళ ఆ మ్రానుమీద నిలువకూడదు. వ్రేలాడదీయ బడినవాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను.

2. నేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువు

లూకా 23:43
అందు కాయన వానితోనేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా ననెను.

ఆయనను శిలువ వేసిన వారినే కాకుండా, ఆయనతో పాటు శిలువ వేయబడిన ఇద్దరి దొంగలలో ఒక దొంగను కూడా యేసు క్రీస్తు క్షమించారు. యేసు క్రీస్తుతో పాటు కుడి వైపు ఒకరు, ఎడమ వైపు ఒకరు ఇద్దరు బందిపోటు దొంగలు కూడా శిలువ వేయబడ్డారు. దుర్మార్గులైన దొంగలతో పాటు యేసును శిలువ వేసేలా దేవుడు ఎందుకు అనుమతించారు అని మనం అనుకోవచ్చు. అది యెషయా 53:12 లో చెప్పినట్లు “అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను” ప్రవచనము నెరవేర్చబడాలని ఇలా జరిగింది.

ఇద్దరి దొంగలలో, ఒక దొంగ మారడం చాల ఆశ్యర్యపరుస్తుంది. ఎందుకంటే, కొంత సమయం ముందు ఈ దొంగ కూడా అందరిలాగే యేసు క్రీస్తును నిందించాడు. శిలువ ప్రారంభమైనప్పుడు అతని కళ్ళు కూడా మూయబడ్డాయి, యేసును నిందించాడు. కానీ కొంత సమయం తరువాత అతను మారు మనస్సు పొందాడు, పశ్చాత్తాప్పడ్డాడు. ఇది ఎలా సాధ్యమైంది?

యేసు ప్రార్ధన :- ఆయనను బాధపెడున్న, శిలువ వేసిన వారిని, నిందిస్తున్న వారిని, అపహసిస్తున్న వారిని కూడా క్షమించమని దేవునికి యేసు క్రీస్తు ప్రభువు ప్రార్ధించడం ఆ దొంగ చూసాడు. అది విన్న తరువాత దొంగ మనసులో అపరాధ భావం కలిగి ఉండవచ్చు.

సువార్త :- యేసు ప్రార్ధన విన్న తరువాత, అందరూ యేసు గురించి చెప్పిన, చెబుతున్న మాటలను నిశితముగా పరిశీలించియుండవచ్ఛు . మనసులో ఆ దొంగ ఇలా నుకుని ఉండవచ్చు.

“ఇతరులను రక్షించెను” (మత్తయి 27:42) – అయితే ఆయన రక్షకుడే

“దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టు వాడా, నిన్ను నీవే రక్షించుకొనుము” (మత్తయి 27:40) – అయితే ఆయన గొప్ప శక్తిమంతుడే

“దేవునియందు విశ్వాసముంచెను ”  (మత్తయి 27:43) — ఆయన దేవుని కుమారుడే.. అందుకే అందరిని క్షమించగలిగారు.

ఇవన్నీ ఆ దొంగ మనసులో సంఘర్షణ కలిగించి, అతనిని పశ్చాత్తాపం వైపు నడిపించి యేసు రక్షకునిగా ఒప్పుకొని ఇలా అంటాడు ” నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను”. రెండవ దొంగ కూడా ఇవన్నీ విన్నాడు కానీ అతడు ఇంకా యేసును నిందిస్తూనే వున్నాడు.

లూకా 23:39-42
వ్రేలాడవేయబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషించుచునీవు క్రీస్తువు గదా? నిన్ను నీవు రక్షించు కొనుము, మమ్మునుకూడ రక్షించుమని చెప్పెను. అయితే రెండవవాడు వానిని గద్దించినీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే యిది న్యాయమే; మనము చేసినవాటికి తగిన ఫలము పొందు చున్నాము గాని యీయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసూ, నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను.

దీనికి జవాబుగా యేసు క్రీస్తు ఈ రెండవ మాటను అంటారు. “అందు కాయన వానితోనేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా ననెను.”

ఈ మాట నుండి మనము రెండు విషయాలు నేర్చుకోవచ్చు.

ఆత్మల భారం:- చివరి క్షణాల్లో కూడా ఇతరుల గురించి, వారి రక్షణ గురించి యేసు క్రీస్తు ఆలోచించడం మనం చూడొచ్చు. ఆ బాధలో కూడా ఆయన సువార్త పంచగలిగారు. మనకు కూడా మన బంధువుల, స్నేహితుల, దగ్గరి వాళ్ళ రక్షణ గురించి అటువంటి భారము కలిగియున్నామా?

సమయం మించిపోలేదు:- మనము ఎంత పాపములో కూరుకుపోయినా మనకి రక్షణ అనుగ్రహించడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆ దొంగ యేసును చివరి క్షణాల్లో రక్షకునిగా అంగీకరించాడు. దానికి యేసు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. మీరు కూడా అటువంటి పాపములో కూరుకుపోయున్నారా ? సమయం మించిపోలేదు, ఇప్పటికైనా యేసు యొద్దకు రండి.

1 యోహాను 1:9
మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.

 

  3. అమ్మా, యిదిగో నీ కుమారుడు

యోహాను 19:26
యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా,యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను,

ఆ శిలువపై బాధపడుతూనే, యేసు ఆయన తల్లిని చూసారు. అప్పుడు ఆమెను పిలిచి, “అమ్మా,యిదిగో నీ కుమారుడు” అని తన తల్లితో చెప్పెను,. తరువాత శిష్యుని చూచి “యిదిగో నీ తల్లి” అని చెప్పెను. ఆ గడియనుండి ఆ శిష్యుడు ఆమెను తన యింట చేర్చుకొనెను. ఈ మూడవ మాటలో యేసు మనకు భాద్యతలు ఎలా నిర్వర్తించాలో నేర్పిస్తున్నారు. ముఖ్యముగా కుటుంబ భాద్యత ఎంత ముఖ్యమో ఆయన చెబుతున్నారు. యూదుల శాసనం ప్రకారం, మొదటి సంతానము వారి తల్లిదండ్రుల భాద్యత తీసుకోవాలి. ఆ శాసనాన్ని ఇక్కడ యేసు క్రీస్తు నిర్వర్తిస్తున్నారు. మరణించేముందు ఆయన తల్లి క్షేమం గురించి అలోచించి, యోహానుకి తల్లి భాద్యత అప్పగించారు. పరలోకపు తండ్రి ఆయనకు అప్పగించిన గొప్ప కార్యమును చేస్తూ కూడా, ఆయన తన కుటుంబ భాద్యత మర్చిపోలేదు.

పరిచర్య ప్రారంభించక ముందు, చిన్నప్పటి నుండి యేసు తల్లిదండ్రులకు విధేయత చూపించారని వాక్యము చెబుతుంది. ఈ మూడవ మాట నుండి నేర్చుకోవాల్సింది – ఆత్మీయముగా దేవునిలో ఎదగడముతో పాటు, సంఘ సహవాసము, కుటుంబ భాద్యతలు కూడా సమర్థముగా మనం నిర్వర్తించాలి.

నిర్గమకాండము 20:12
నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.

 

4. నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి

మత్తయి 27:46
ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసుఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము.

ఈ నాల్గవ మాట, యేసు క్రీస్తు కీర్తనలు 22 అధ్యాయము, మొదటి వచనం నుండి చెబుతారు.

కీర్తనలు 22:1
నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు?

తండ్రియైన దేవునితో యేసుక్రీస్తు బంధం చాలా గొప్పది. ఆ బంధం ఎంతో దగ్గరైనది, ఎంతో బలమైనది. యేసు క్రీస్తు అద్భుతములు చేసినప్పుడు, స్వస్థత చేసినప్పుడు అది మనం చూడవచ్చు. పాపులను క్షమించే అధికారము కూడా దేవుడు యేసు క్రీస్తుకి ఇచ్చారు. అంతే కాకుండా తండ్రి ఏమి చెబితే, నేను అదే మాట్లాడతానని యేసు చెబుతారు. ఉదాహరణకు కింద ఉన్న వాక్యములు చూడండి.

యోహాను 5:19
కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును.
యోహాను 8:28
కావున యేసుమీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే యేమియు చేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు.

తండ్రితో అటువంటి గొప్ప అనుబంధము కలిగియున్న యేసు, ఒక్కసారి ఆ దేవుడు యేసు ఒంటరిగా వదిలేస్తే ఆ భాధ ఎలా ఉంటుందో ఆలోచించండి. యేసు క్రీస్తు, తండ్రి నుండి వేరుచేయబడ్డారు. లోకముయొక్క సమస్త పాపభారము ఆయనపై మోపినప్పుడు, మన పాపములకు ఆయన శిక్ష అనుభవిస్తున్న సమయములో దేవుడు యేసు వైపు ఉండకూడదు. ఈ భాధ మనము అనుభవించాలి. కానీ మనల్ని తండ్రితో కలపడానికి, తండ్రితో మన బంధాన్ని తిరిగి ఏర్పరడానికి ఇంత భయంకరమైన భాధను కూడా యేసు ఎదుర్కొన్నారు.

2 కొరింథీయులకు 5:19-21
అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధానవాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమైదేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.

ఈ మాట ద్వారా తండ్రియైన దేవునికి మన మీద ఉన్న గొప్ప ప్రేమను అర్ధం చేసుకోవచ్చు.  మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు ఆయన కుమారుడిని కూడా బలియర్పణగా మన పాప క్షమాపణ కోసం ప్రసాదించారు.

 

  5. నేను దప్పిగొను చున్నాననెను

యోహాను 19:28
అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లునేను దప్పిగొను చున్నాననెను.

యేసు క్రీస్తును శిలువ వేసినప్పుడు మొదట ఆయన చేసు కలిపిన ద్రాక్షరసం ఇస్తారు. అయితే అది ఆయన స్వీకరించలేదు. కొన్ని గంటల తరువాత, ప్రవచనములు నెరవేర్చడానికి ఆయన “నేను దప్పిగొను చున్నాను” అంటారు. ఆ ప్రవచనము కీర్తనలు 69:21 లో ఇలా ఉంటుంది.

కీర్తనలు 69:21
వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పియైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి.

ఈ మాట ద్వారా ఆయన భౌతిక శరీరములో సామాన్య మానవుని వలే భాధను అనుభవించారు అని తెలుసుకోవచ్చు.

ఇందులో ఇంకొక పాఠం. యేసు క్రీస్తు దప్పికగా ఉంది అంటే మీకు కూడా ఆయనకు నీళ్లు ఇవ్వాలని ఉంది కదా! మనం ఆ సమయంలో అక్కడ లేకపోచ్చు కానీ మనం రోజూ యేసు క్రీస్తుకి దాహం తీర్చే మార్గం చెప్పారు.

మత్తయి 25:35-40
నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పి గొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి;  దిగంబరినై యుంటిని, నాకు బట్ట లిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెర సాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును అందుకు నీతిమంతులుప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొ నియుండుట చూచి నీకాహారమిచ్చి తివిు? నీవు దప్పిగొని యుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితివిు? ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితివిు? ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజుమిక్కిలి అల్పులైన యీ నా సహోదరు లలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చ యముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.

మనందరికీ కూడా ఎన్నో అవసరాలు ఉండొచ్చు. మన చుట్టూ ఉన్నవాళ్లు కూడా ప్రేమ కోసము, సహాయము కోసము, ఇతర అవసరతల కోసం చూస్తూ ఉండవచ్చు. పైన వాక్యములో చెప్పినట్లు మన చుట్టూ ఉన్న వాళ్ళ అవసరాలు తీర్చటం ద్వారా మనం యేసు క్రీస్తు దప్పిక తీర్చిన వాళ్ళమౌతాం.

 

6. సమాప్తమైనది

యోహాను 19:30
యేసు ఆ చిరక పుచ్చుకొనిసమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను.

ఈ మాటలు విజయముతో యేసు క్రీస్తు మొఱపెట్టినవి. ఈ మాటతో యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశ్యము నెరవేరినది. ఇక్కడ ఏమి సమాప్తమైందో చూద్దాం.

తండ్రి ఇచ్చిన పనిని యేసు క్రీస్తు పూర్తి చేసారు: యోహాను 10:17-18 లో ఇలా వ్రాయబడింది.

యోహాను 10:17-18
నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందు వలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను.

మానవుల రక్షణకోసం, తండ్రియైన దేవుడు, యేసు క్రీస్తుకి ఒక గొప్ప కార్యమును అప్పగించారు. పాపమూ లేకుండా జీవించి, లోక రక్షణార్థం శిలువపై బలియర్పణగా తనను తాను అర్పించుకుని, యేసు క్రీస్తు ప్రభువు ఆ కార్యమును సమాప్తం చేసారు.

ప్రవచనములు నెరవేర్చెను:- పాత నిబంధన గ్రంధములో సుమారు 300 ప్రవచనాలు, యేసు క్రీస్తు జీవితములో, ఆయన పరిచర్యలో, ఆయన శిలువ మరణములో, పునరుత్తానములో నెరవేర్చబడ్డాయని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. ఒక ఉదాహరణగా ఆయన మరణమును ప్రవచించిన ఒక వాక్యము చూద్దాం.

యెషయా 53:3-6,8,12
అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతివిు.  నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితివిు. మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.
మనమందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.
అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలో చించినవారెవరు? కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణ మును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెను

ఈ ప్రవచనముల ద్వారా, పాపము నుండి ప్రజలను రక్షించడానికి ఒక రక్షకుడిని ప్రసాదిస్తానని దేవుడు  వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం యేసు క్రీస్తులో నెరవేర్చబడినది. క్రింద వచనములు కూడా దానిని ధృవీకరిస్తాయి.

1 పేతురు 2:24
మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.
1 కొరింథీయులకు 15:3-4
నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను.

సాతాను పై విజయం: శిలువపై యేసు క్రీస్తు ముగించిన మరియొకటి సాతాను పై విజయం. 1 యోహాను 3:8 ఇలా ఉంటుంది. యేసు క్రీస్తు ఆ పని శిలువపై ముగించారు.

1 యోహాను 3:8
అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి; అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.
ఆదికాండము 3:15
మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను.

శిలువపై యేసు క్రీస్తు ప్రభువు సాతానుపై విజయం సాధించారు.

 

7.తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను

లూకా 23:46
అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి–తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను.

మరణించే ముందు యేసు క్రీస్తు పలికిన చివరి మాటలు ఇవి. ఈ లోకానికి వచ్చిన పనిని కీర్తనలు 31:5 వచనంతో యేసు క్రీస్తు ముగిస్తారు. తండ్రియైన దేవునిపై యేసు క్రీస్తుకు ఎంత నమ్మకం, విశ్వాసం ఉందో  ఈ మాట ద్వారా అర్ధం అవుతుంది. “అప్పగించుకొనుచున్నాను ” అన్న మాట ఇక్కడ చాలా ముఖ్యమైంది. ఇక్కడ ఆత్మ ఆయనను విడిచి పోలేదు. ఆయన అప్పగిస్తే, ఆయన అనుకున్నపుడు, దేవునికి అప్పగిస్తే ఆత్మ ఆయనను విడిచెను. దీని ద్వారా ఆయన యొక్క సంపూర్ణ సమర్పణ అర్ధమవుతుంది.

అంతే కాకుండా, ఆయన ప్రతిరోజు సంపూర్ణ సమర్పణలో జీవించినట్లే మరణములో కూడా సంపూర్ణ సమర్పణతో మరణించారు. ప్రతిరోజూ తండ్రి మాటలు వింటూ, విధేయత చూపిస్తూ, మరణములో కూడా విధేయత చూపించారు.

ఫిలిప్పీయులకు 2:8
మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందు నంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.

మన జీవితము కూడా దేవునికి సంపూర్ణముగా అర్పించామా? దేవునియొక్క ఉదేశ్యము కొరకు, ఆయన రాజ్యము కొరకు మన జీవితాలు సమర్పించుకున్నామా?

రోమీయులకు 12:1
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.

చివరగా, యేసు క్రీస్తు ప్రభువు శిలువ మరణం వలనే  మానవాళికి పాపవిమోచన కలిగింది. ఆ శిలువ వలనే దేవుని ద్రుష్టిలో మనము నీతిమంతులుగా ఎంచబడ్డాము. దేవుని కృప, నీతి, పాపక్షమాపణ శిలువ వద్దనే మనకు దొరుకుతాయి. యేసు క్రీస్తు ప్రభువు బలియర్పణ వలనే మనకు జీవము అనుగ్రహించబడినది.

మీలో ఎవరైనా, ఇంకా పాపములో జీవిస్తుంటే, పాపభారమును మోస్తుంటే, ఇప్పటికైనా యేసు యొద్దకు రండి. తండ్రియైన దేవుడు మిమ్మల్ని దగ్గరకు చేర్చుకోవడానికి సిద్ధముగా ఉన్నారు. మిమ్మల్ని క్షమించి, రక్షణ భాగ్యము అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ మీకు యేసు గురించి తెలిసి, ఆయన సహవాసమునుండి దూరంగా వెళ్లిపోయారా? దేవుడు మిమ్మల్ని తిరిగి రమ్మంటున్నారు. యేసు యొద్దకు వచ్చి పాపములను ఒప్పుకొని, ఆయనకు మీ జీవితమును సమర్పించుకొనండి.

యోహాను 3:16
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.

ఆ దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *