మనము ఇప్పుడు అడ్వెంట్ సీజన్‌లో ఉన్నాము. అడ్వెంట్ అంటే రాబోయేది లేదా ఆగమనం అని అర్ధం. క్రీస్తు వచ్చిన రోజు గురించి ఎదురుచూస్తూ, క్రీస్తు ధ్యానములో, ప్రార్థనలో మరియు ఉపవాసములో గడిపే నాలుగు వారాలను అడ్వెంట్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు, 2000 సంవత్సరాల క్రితం ఈ భూమిపైకి వచ్చిన యేసు క్రీస్తు పుట్టుకను గురించి క్రిస్మసును ఈ అడ్వెంట్ సీజన్లో జరుపుకుంటున్నారు. ఈ అడ్వెంట్ కి మరో కూడా కోణం ఉంది. క్రీస్తు చాలా కాలం క్రితం వచ్చాడని మాత్రమే కాదు, ఆయన మళ్లీ తిరిగి వస్తున్నాడు అని కూడా ఈ అడ్వెంట్ లో గుర్తు చేసుకోవాలి. అంతే కాకుండా, క్రీస్తు రాకడను పండగలా జరుపుకోవడానికి మనకు కారణం ఉన్నట్లే, ఆయన మళ్లీ వస్తాడనే నిరీక్షణ కూడా మనకు ఉండాలి.
ఈ లోకం క్రిస్మస్ సీజన్‌ను ఒక సాధారణ సెలవులు మాదిరిగా చూడవచ్చు లేదా సొంత కోరికలపై, వస్తువులు, గిఫ్టులు కొనుక్కోవడంపైనా మాత్రమే దృష్టి పెట్టవచ్చు. లేదా క్రిస్మస్ యొక్క సాంస్కృతిక అంశాలైన శాంటా, క్రిస్మస్ చెట్టు, క్రిస్మస్ కేకు, లైట్లు మొదలైన వాటిపై దృష్టి పెట్టవచ్చు, కానీ అనేక ఉరుకులు పరుగులతో కూడిన, అస్తవ్యస్తమైన ఈ సమాజములో క్రిస్మస్ యొక్క నిజమైన అర్థాన్ని మనం మరచిపోకూడదు.
కాబట్టి, ఈరోజు యేసుక్రీస్తు ఈ భూమిపైకి రావడానికి గల 7 కారణాలను మనం పరిశీలిద్దాం.
1. మన పాపాల నుండి మనల్ని రక్షించడానికి:
క్రీస్తు జననం గురించిన వాక్య భాగములో, దేవదూత, యోసేపుకు కలలో కనిపించినప్పుడు, దేవదూత యోసేపుతో ఇలా చెప్పారు, మరియ ఒక కుమారుడిని కంటుంది. మరియు మీరు అతనికి యేసు అని పేరు పెట్టాలి ఎందుకంటే ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడు.
మత్తయి 1:21
21తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు2 అను పేరు పెట్టుదువనెను.
దేవదూతలు, గొర్రెల కాపరులకు ప్రత్యక్షమైనప్పుడు, వారు యేసును రక్షకుడు అని పిలిచారు. యేసుక్రీస్తు మనల్ని దేనినుండి రక్షిస్తారు? పాపము నుండి, నరకము నుండి, అంధకార బంధకముల నుండి ఆయన మనల్ని రక్షిస్తారు. అందుకే ఆయనను రక్షకుడు అని దూతలు సంభోదించారు.
లూకా 2:11
11దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు.
సిలువపైన ఆయన చేసిన బలియాగమును బట్టి, మనల్ని క్షమించి, పాపమును నుండి మనల్ని యేసు రక్షిస్తారు.
యోహాను 3:16
16దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా3 పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
అపోస్తులకార్యములు గ్రంథములో వ్రాయబడినట్లు, పౌలు అధికారులముందు నిలబడి, పరిశుద్ధాత్మతో నింపబడి, యేసు క్రీస్తు ద్వారా మాత్రమే మానవాళికి రక్షణ అని ప్రకటించాడు.
అపోస్తుల కార్యములు 4:12
12మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.
2. ప్రజలతో కలిసి ఉండటానికి:
దేవదూత యోసేపుతో కలలో మాట్లాడిన అదే భాగంలో, దేవదూత ఆయన పేరు ఇమ్మాన్యుయేల్ అని పిలుస్తారని పాత నిబంధన ప్రవచనాన్ని పేర్కొన్నాడు. ఇమ్మానుయేల్ అంటే “దేవుడు మనతో ఉన్నాడు” అని అర్ధం.
మత్తయి 1:22-23
22ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు
23అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.
యేసుక్రీస్తు యోసేపు మరియు మరియలతో ఉన్నాడు. పరిచర్యలో, ఆయన శిష్యులతో మరియు ఆయన ద్వారా స్వస్థత పొందిన, విడుదల పొందిన మరియు బాగుపడిన ప్రజలందరితో కూడా ఉన్నాడు. ఆయన ఇప్పుడు మనతో ఉన్నాడు, దేవుని వాక్యం ద్వారా మరియు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనతో ఎప్పుడూ ఉంటారు.
మత్తయి 28:20
20నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.
హెబ్రీయులకు 13:5
5ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి.నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా.
ప్రకటన 3:20
20ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.
దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనలను సమీపించాడు మరియు ఆయన మనతో ఉన్నాడు. మీ జీవితంలో మీరు ఆయన కోసం మీ హృదయం తలుపులు తెరిచారా?
3. లేఖనాలను నెరవేర్చడానికి:
మీరు సువార్తలను చదివితే, క్రీస్తు జననం నుండి శిలువ మరణం వరకు, ఎన్నో ప్రవచనాలు నెరవేరాయి. మత్తయి 1: 23లో పేర్కొన్న విధంగా క్రీస్తు జననం కూడా ఒక ప్రవచన నెరవేర్పు. ఒక కన్య అయిన మరియ గర్భము ధరిస్తుంది.
యెషయా 7:14
14కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.
మరొక ఉదాహరణ, జ్ఞానులు హేరోదును కలుసుకున్నప్పుడు, అతను క్రీస్తు ఎక్కడ జన్మించాడని అతని లేఖకులను అడిగాడు మరియు వారు అతనికి బేత్లెహేము అని చెప్పారు. ఆ విషయము వారికి ఎలా తెలిసింది? ఇది పాత నిబంధన ప్రవచనంలో ఉంది.
మత్తయి 2:4-5
4కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమ కూర్చిక్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను.
5అందుకు వారుయూదయ బేత్లెహేములోనే; ఏల యనగాయూదయదేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు;ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును అని ప్రవక్తద్వారా వ్రాయబడియున్నదనిరి.
లూకా 24:27లో, యేసుక్రీస్తు స్వయంగా తన ఇద్దరు శిష్యులతో లేఖనాల నెరవేర్పు గురించి మాట్లాడారు.
లూకా 24:27
27మోషేయు సమస్త ప్రవక్తలును మొదలు కొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను.
1 కొరింథీయులకు 15 లో, పౌలు లేఖనాల ప్రకారం క్రీస్తు చనిపోయి తిరిగి లేచారని చెప్పాడు.
1 కొరింథీయులకు 15:3-4
3నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను,
4లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను.
4. మన రక్షణకోసం సిలువపైన చనిపోవడానికి:
ఒకసారి ఊహాత్మకంగా ఆలోచిస్తే, మానవాళి మోక్షానికి మనకు కావలసింది దేవుడు భూమిపైకి వచ్చి చనిపోవడమే అయితే, యేసు కేవలం ఒక పెద్దవ్యక్తిగా ప్రత్యక్షమై, మరుసటి రోజు అతను సిలువపై మరణించి ఉండవచ్చు. కానీ, అది అలా జరగలేదు. ఎందుకంటే, యేసు మానవునిగా పుట్టి పాపం లేని పరిపూర్ణ జీవితాన్ని గడపాలి. అప్పుడే అది మానవాళి మోక్షానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే దేవుడు, మానవాళి పాపాలకు శిక్ష వేయాలంటే, ఆ వ్యక్తి పాపం లేనివారై ఉండాలి. దానికి పరిశుద్ధాత్మ ద్వారా మానవ శిశువుగా భూమిపైకి రావడం తప్ప వేరే మార్గం లేదు. అందుకే యేసుక్రీస్తు మన కోసం అలా చేసారు. ఆయన అందరిలాగే పెరిగినా, పాపం లేకుండా పెరిగారు. సిలువపైన మన రక్షణ కోసం తనను తాను అర్పించుకున్నారు. ఇదంతా యేసుక్రీస్తు మనకోసం చేశారు.
2 కొరింథీయులకు 5:21
21ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.
సిలువపై క్రీస్తు చేసిన ప్రాయశ్చిత్తం ద్వారా దేవునికి మనపట్ల ఉన్న ప్రేమను గురించి ఈ దిగువ వచనాలు మాట్లాడుతున్నాయి.
1 పేతురు 3:18-19
18ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరవిషయములో చంపబడియు,
19ఆత్మవిషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను.
రోమీయులకు 3:24-26
24కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు చున్నారు.
25పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని
26క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.
1 యోహాను 2:2
2ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాప ములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు.
1 యోహాను 4:10
10మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.
5. పునరుత్థానం అవ్వడం ద్వారా మనకు నిరీక్షణ కలిగించడానికి:
పునరుత్థానం గురించి ఒకరు చెప్పిన మాట ఒకటి నాకు గుర్తుంది. ఆయన ఏమంటారంటే, యేసుక్రీస్తు పునరుత్థానం లేకపోతే, క్రైస్తవ మతానికి నిరీక్షణ అనేది ఉండదు అని. పునరుత్థానం ఉండాలంటే, క్రీస్తు మరణం ముఖ్యం. సిలువపై చనిపోవాలంటే, క్రీస్తు జననం ఇంకా ముఖ్యం. కాబట్టి, ఈ మూడు సంఘటనలు, క్రీస్తు పుట్టుక, మరణం మరియు పునరుత్థానం అనేది ప్రతి విశ్వాసికి మరియు క్రైస్తవ మతం యొక్క ఉనికికి అత్యంత ముఖ్యమైన సంఘటనలు. సమాధిలో 3 రోజుల తర్వాత యేసుక్రీస్తు పునరుత్థానం, దేవుని శక్తి ప్రదర్శనకు మాత్రమే కాకుండా, క్రైస్తవుని భవిష్యత్తు నిరీక్షణకు కూడా చాలా ముఖ్యమైనది. యేసుక్రీస్తు జీవపు పునరుత్థానం. భవిష్యత్తులో, క్రీస్తు రెండవ రాకడలో, మరణించిన విశ్వాసులందరూ లేస్తారు మరియు వారు ఎప్పటికీ దేవుని సన్నిధిలో ఉంటారు. ఇదే మనకున్న నిరీక్షణ. ఆయన మన శరీరాలను మహిమాన్వితమైన శరీరాలుగా మారుస్తాడు. మనము ఈ లోకములో, ఈ దేహంలో పరీక్షలు, కష్టాల ద్వారా వెళ్ళినప్పటికీ, త్వరలోనే మనం పునరుత్థానమైన శరీరంతో దేవుని సన్నిధిలో ఉంటాము.
ఫిలిప్పీయులకు 3:20-21
20మన పౌరస్థితి పర లోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము.
21సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమ రూపము గలదానిగా మార్చును.
1 పేతురు 1:3-6
3మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక.
4మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను.
5కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధ ముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసముద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.
6ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమునుబట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.
1 కొరింథీయులకు 15:20-23
20ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమఫలముగా క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడు.
21మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను.
22ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.
23ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రది కింపబడుదురు.
మనం ఆదాములో చనిపోయాము. అంటే, మనం ప్రపంచానికి అనుగుణంగా మరియు శరీరానికి అనుగుణంగా జీవిస్తే, మనం చనిపోయినట్లే. కానీ యేసుక్రీస్తులో, మనం సజీవంగా ఉన్నాము. మనకు శాశ్వతమైన జీవితం ఉంది.
యోహాను 11:25-26
25అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకును;
26బ్రదికి నాయందు విశ్వాస ముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను.
మీరు దీన్ని నమ్ముతారా? యేసు కేవలం తాను పునరుత్థానాన్ని తీసుకువస్తానని లేదా పునరుత్థానానికి కారణం అవుతానని చెప్పడం లేదు, నేనే పునరుత్థానం మరియు జీవం అని యేసు చెబుతున్నారు. ఇది చాలా గొప్పమాట. చనిపోయినవారి పునరుత్థానం మరియు దేవునితో సహవాసంలో నిజమైన నిత్యజీవం, ఇవి రెండూ యేసుతో చాలా దగ్గరగా ముడిపడి ఉన్నాయి, అవి ఆయనలో మూర్తీభవిస్తాయి మరియు ఆయనతో సంబంధంలో మాత్రమే కనుగొనబడతాయి.
ఇదే అయన మనకు చేసిన ఒక వాగ్దానం. ఆయనే పునరుత్థానం మరియు జీవం. మనం ఆయనను విశ్వసిస్తే మనకు నిత్యజీవం ఉంటుంది.
6. తండ్రి మరియు మనకు మధ్య మధ్యవర్తిగా ఉండడంకోసం:
పాపం ఈ లోకములోనికి ప్రవేశించినప్పుడు, మానవాళి దేవునితో సంబంధాన్ని కోల్పోయింది. రోమీయులకు 3:23 చెప్పినట్లు, అందరూ పాపం చేసి దేవుని మహిమకు దూరమయ్యారు. మనందరమూ నిరీక్షణ కోల్పోయాము, తండ్రితో సంబంధాన్ని కోల్పోయాము, తండ్రితో సహవాసం కోల్పోయాము. దేవుడు మనలను ఎంతగానో ప్రేమించాడు కాబట్టి, మనము పాపంలోనే చనిపోవాలని, శాశ్వతమైన నరకములో నశించిపోవాలని కోరుకోలేదు. అందుకే, తండ్రియైన దేవునికి మరియు మానవాళికి మధ్య అంతరాన్ని తగ్గించడానికి యేసుక్రీస్తు భూమిపైకి వచ్చాడు. మీరు, నేను తండ్రితో శాశ్వతమైన సంబంధాన్ని కలిగి ఉండటానికి ఆయన సిలువపైన వెల చెల్లించాడు.
1 తిమోతికి 2:5
5దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.
హెబ్రీయులకు 9:14-15
14నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించు కొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును.
15ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తియై యున్నాడు.
యేసుక్రీస్తు, తండ్రియైన దేవునికి మరియు మనకు మధ్య మధ్యవర్తి. ఆయన మధ్యవర్తి మాత్రమే కాదు, మనకు మధ్యవర్తిత్వం వహించే న్యాయవాది కూడా.
1 యోహాను 2:1
1నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండు టకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు.
రోమీయులకు 8:34
34శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతే కాదు, మృతులలోనుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే.
యోహాను 14:6 లో చెప్పినట్లుగా, తండ్రియైన దేవునియొద్దకు చేరుకునే ఏకైక మార్గం యేసు క్రీస్తు ప్రభువు. తండ్రికీ, మనకు మధ్యన ఉన్న ఒక వారధి వంటివారు యేసు క్రీస్తు ప్రభువు.
యోహాను 14:6
6యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.
7. దేవుని రాజ్య స్థాపనకై తిరిగి రావడానికి:
చివరగా, అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ క్రిస్మస్ సీజన్‌లో మనం గుర్తుంచుకోవలసిన విషయం, యేసుక్రీస్తు మళ్లీ వస్తున్నారు. ఆయన రాకడకుి మనం సిద్ధంగా ఉన్నామా? లేదా మనం ఇంకా ఐహిక సుఖాలు, విజయాలు మరియు సంపదలపై దృష్టి పెడుతున్నామా? గుర్తుంచుకోండి, మనం శ్రద్ధ వహించకపోతే, యేసుక్రీస్తు రాకడ మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది మరియు ఆయన రాజ్యంలో భాగమయ్యే అవకాశాన్ని మనం కోల్పోవచ్చు. ఆయన మళ్ళీ వస్తున్నారు. అవును, ఆయన తన ప్రజలతో ఉండడానికి, ఈ ప్రపంచాన్ని మరియు ప్రజలను తీర్పు తీర్చడానికి, తన రాజ్యాన్ని స్థాపించడానికి మరియు ప్రకటన గ్రంధములో వ్రాయబడిన అనేక ప్రవచనాలను నెరవేర్చడానికి తిరిగి వస్తున్నాడు.
1 థెస్సలొనీకయులకు 4:16-18
16ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.
17ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.
18కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి.
ఫిలిప్పీయులకు 3:20-21
20మన పౌరస్థితి పర లోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము.
21సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమ రూపము గలదానిగా మార్చును.
ప్రకటన 1:7
7ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్.
ప్రకటన 3:11
11నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము.
ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి వచ్చే సమయం మరియు రోజు ఎవరికీ తెలియదు. కాబట్టి, మనం సమయాన్ని వృథా చేయకుండా దేవుని పనికి వినియోగించుకోవాలి. యేసుక్రీస్తు మరియు పరలోక విషయాలపై దృష్టి పెట్టాలి. పెళ్లికొడుకు కోసం సిద్ధపడని మూర్ఖపు కన్యలలా మనం రాకడ విషయములో ఆశ్చర్యపోకూడదు. అప్రమత్తంగా ఉండండి, విశ్వాసంతో కొనసాగండి మరియు దేవునికి మహిమ కలిగించే జీవితాన్ని గడపండి, తద్వారా మనం ఆ రోజున యేసురాజ్యములో ఉంటాము అనే నమ్మకంతో ఉండగలం. మనం ప్రతిరోజూ “మరణతా, ప్రభువైన యేసూ, రమ్ము” అని చెప్పగలగాలి.
ఈ క్రింది వచనాలు, యేసు క్రీస్తు త్వరలో రాబోతున్నారని ధ్రువీకరిస్తూ, మనము ఆ రోజు కోసం సిద్ధపడి ఉండాలని మనల్ని హెచ్చరిస్తున్నాయి.
మత్తయి 24:44
44మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.
హెబ్రీయులకు 10:24-25
24కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు,
25ఆ దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.
ప్రకటన 22:12
12ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.
1 పేతురు 4:7
7అయితే అన్నిటి అంతము సమీపమైయున్నది. కాగా మీరు స్వస్థ బుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి.
1 యోహాను 2:28
28కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన యెదుట సిగ్గుపడక ధైర్యము కలిగియుండునట్లు మీరాయన యందు నిలిచియుండుడి.
మీరు ఈ క్రిస్మస్ సీజన్లో, యేసుక్రీస్తుకు మరింత దగ్గరై, దేవునితో గొప్ప సంబంధాన్ని కలిగి ఉండండి. యేసుక్రీస్తును మీరు ప్రభువుగా ఇంకా అంగీకరించకపోతే, ఇప్పుడే “ప్రభువా, నన్ను క్షమించు, నా పాపములకు నీవు శిలువపై నా కోసం చనిపోయావని, మూడవ దినమున తిరిగిలేచావని, నిత్యజీవితము నాకు అనుగ్రహించావని నమ్ముతున్నాను. నా హృదయములోనికి రండి”. అని ప్రార్థన చేయండి.
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక!
[ఏమైనా సూచనలు, సలహాలు, లేదా ఏమైనా ప్రశ్నలు ఉంటే, క్రింద కామెంట్లో తెలియజేయగలరు.]