ఈ రోజు బైబిలు వచనం!
మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను. -యోహాను 8:12
వచనం వివరణ!
మనకు వెలుగు ఎంత అవసరమో అందరికి తెలుసు. వెలుగు లేకపోతే మనం ఏమీ చూడలేము. నేను లోకమునకు వెలుగు అని యేసు ప్రభువు ఇక్కడ చెబుతున్నారు. ఆయన లేకుండా మనము దేవునివద్దకు చేరుకోలేము. ఆయన లేకుండా మన జీవితములో ఏమైనా పాపము ఉంటే దానిని గుర్తించలేము. మన రక్షణకు యేసు క్రీస్తు మాత్రమే మార్గము. అంతే కాకుండా పైన వచనములో చెప్పినట్లు యేసు లోకమునకు వెలుగు అని తెలుసుకోవడమే కాకుండా ఆయనను వెంబడించడము కూడా చాలా ముఖ్యము. ఆయన వెలుగైయున్నాడని తెలుసుకోవడము లేదా నమ్మడము వలన ఎటువంటి ఉపయోగము లేదు. ఆయనను వెంబడించాలి అప్పుడే మన జీవితములో ఉన్న పాపములు తెలుసుకోగలం. ఆయన మాత్రమే మనల్ని అంధకారమునుండి బయటపడేయగలరు. మనకు ఇష్టముగా ఉండే, ఆకర్షించే వెలుగులు లోకములో ఇంకా చాలా ఉండవచ్చు కానీ అవి అబద్దమైనవి. అవి నిత్యజీవమును మనకు ఇవ్వలేవు. యేసు మాత్రమే మనకు నిత్యజీవమును ఇవ్వగలరు. అందుకే నిజమైన వెలుగైన యేసును మన జీవితములో వెంబడిద్దాం. ఆయన వాక్యమును ధ్యానించుచు, ఆ వాక్యపు వెలుగులో మన జీవితాలు మార్చుకోవాలి.
ప్రార్ధన!
పరలోకమునందున్న మా తండ్రీ, మీ వాక్యమును బట్టి మీకు వందనములు. మా రక్షణ కొరకై మీ కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకమునకు పంపినందుకు వందనములు. ప్రభువా, మమ్మల్ని ఎంతో ప్రేమించి మా కొరకై శిలువపై శిక్షను అనుభవించినందుకు వందనములు. ఈ లోకమునకు వెలుగైనందుకు మీకు స్తోత్రములు. మిమ్మల్ని ప్రతిదినము వెంబడించుటకు మాకు సహాయము చేయండి. పరిశుద్దాత్మ దేవా, మా జీవితములో ఉన్న పాపములను, అపరాధములను మాకు తెలియజేయండి. చీకటి నుండి వెలుగువైపుకు మేము నడుచుకొనేలా మాకు సహాయము చేయండి. ఆత్మీయ జీవితములో మేము ఎదిగేలా, మీ వాక్యమును బట్టి జీవించేలా మమల్ని మార్చండి. మీ రాజ్యము కొరకు మా జీవితములను ఉపయోగించుకొనండి. మేము చేసే ప్రతీ పనిలో, నిత్యము మీరే మహిమ పొందుకొనాలని యేసు క్రీస్తు నామములో ప్రార్ధిస్తున్నాము. ఆమెన్.