మత్తయి 24:45-51
45యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు డెవడు? 46యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. 47అతడు తన యావదాస్తిమీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 48అయితే దుష్టు డైన యొక దాసుడునా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని 49తనతోడి దాసులను కొట్ట మొదలుపెట్టి, త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటె 50ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి, వానిని నరికించి వేషధారులతో కూడ వానికి పాలు నియ మించును. 51అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును.
ఈ అధ్యాయం ఎలా మొదలవుతుందో చూస్తే, యేసు క్రీస్తు పరిచర్య చివరి దశలో ఉంటుంది. ఈ అధ్యాయము లోనే ఆయన రెండవ రాకడ గురించి శిష్యులకు వివరిస్తారు. 1 వ వచనంలో యేసు క్రీస్తుకు ఆయన శిష్యులు యూదుల ఆలయమును చూపిస్తారు. అప్పుడు యేసు ఆ ఆలయం ఖచ్చితముగా త్వరలో పడద్రోయబడునని వారితో చెప్తారు. అది విని బహుశా శిష్యులు కంగారు పడిఉంటారు. శిష్యులు అప్పుడు యేసుని యుగసమాప్తి గురించి, ఆలయం పడద్రోయడం గురించి అడుగుతారు. 3 వ వచనము నుండి 44 వ వచనము వరకు యేసుక్రీస్తు అంత్య దినముల గురించి, ఆ దినములు ఎలా వుంటాయో, ఆయన రెండవ రాకడ గురించి వివరిస్తారు. అంతే కాకుండా నా పేరుతో వచ్చి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తారు, వారిని చూసి మోసపోవద్దు అని యేసు శిష్యులను హెచ్చరిస్తారు. ఆయన రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియదు కానీ ఎప్పుడు జరిగినా దానికి సిద్ధముగా ఉండాలి అని యేసు చెప్తారు.
ఈ విషయాలు చెబుతున్న సందర్భములో యేసు క్రీస్తు నమ్మకస్తుడైన దాసుడు, దుష్టుడైన దాసుడు అనే ఉపమానము చెబుతారు.
45యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు డెవడు? 46యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు.
ఇక్కడ యజమానుడు యేసుక్రీస్తు, ఇంటివారు అంటే సంఘము, మరియు అన్నము అనగా దేవుని వాక్యము. ఈ వాక్యంలో దాసుడు అంటే చాలా మంది సంఘకాపరి లేదా సంఘ పెద్ద అనుకుంటారు ఎందుకంటే వారే సంఘమునకు దేవుని వాక్యమును బోధిస్తారు గనుక. కానీ ఈ వాక్యము అందరు క్రైస్తవులకు వర్తిస్తుంది. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడికి సంఘములో లేదా ఇంట్లో లేదా పని చేసే చోట ఇతరులకు దేవుని వాక్యమును చెప్పే బాధ్యత ఉంటుంది. దేవుడు మనకు అటువంటి అవకాశములు కల్పిస్తారు.
అంతేకాకుండా 45 వ వచనంలో తగినవేళ అన్నము అని ఉంటుంది, అంటే సంఘములో ఉన్న సభ్యులకు వారికి అవసరమైన సమయములో, దేవుడు వారికి చెప్పమని ఇచ్చిన వాక్యమును బోధించాలి. సంఘములోనే కాకుండా, మన ఇంట్లో కూడా పిల్లలకు ప్రతిరోజు వాక్యమును భోధించమని దేవుడు చెప్పారు (ద్వితీయోపదేశకాండము 6:7). దేవుని వాక్యమునకు విధేయత చూపించి, ఆయన ప్రణాళిక ప్రకారము మనము నడుచుంటే, ఇతర విశ్వాసులు దేవునిలో ఎదిగేలా దేవుడు వారి బాధ్యత మనకు అప్పగిస్తారు.
46 వ వచనంలో యేసు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన పనిని నమ్మకముగా చేస్తున్న దాసులు ధన్యులు అని ఉంటుంది.
లూకా 18:8
ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును; వారినిషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా?
నమ్మకస్తుడైన దాసుడు :
- యజమాని (దేవుడు) అప్పగించిన పనిని నమ్మకముగా, బుద్ధిగా నిర్వహిస్తాడు.
- లోకము దృష్టిలో గొప్ప పని కాకపోయినా, దేవుని రాజ్యము కొరకు నమ్మకముగా ఉంటాడు.
- పరలోకములో యేసు క్రీస్తును చేరుకోవాలనే నిర్దిష్టమైన లక్ష్యము కలిగి ఉంటారు.
- యజమానికి (దేవునికి) ఇష్టమైన, పేరు తెచ్చే పనులు చేస్తాడు.
జీవితమంతా దేవుని నమ్మకముగా ఉంటే యేసు తో పాటు దేవుని రాజ్యములో మనల్ని కూడా పరిపాలించే అవకాశము ఇస్తారు. మనము కూడా దేవుడు మనకు అప్పగించిన పనిలో నమ్మకముగా ఉంటున్నామా? మన జీవితములో ఆయన ప్రణాళిక ప్రకారము ఏమి పని చేయాలో మనకు తెలుసా? ఒకసారి మనల్ని ప్రశ్నించుకోవాలి. దేవుని వాక్య ప్రకారము ఒక భార్య/భర్త గా, మంచి తల్లి/తండ్రిగా, భాద్యత గల సంఘ సభ్యునిగా మనం ఉంటున్నామా? మనం పనిచేసే చోట దేవునికి సాక్ష్యముగా ఉంటున్నామా?
దుష్ట దాసుడు:
విశ్వాస జీవితమును మంచిగా ఆరంభించి ఉంటారు కానీ సాతాను వారిలో అవిశ్వాసమును కలిగించి యేసు క్రీస్తు రెండవ రాకడను నమ్మకుండా చేస్తాడు. ఈ వాక్యము చదివినప్పుడు నాలో చాలా ఆందోళన కలిగింది ఎందుకంటే ఇక్కడ దుష్ట దాసుడు యేసును నమ్మని అవిశ్వాసి కాదు, సంఘములో ఉండే విశ్వాసే. చాలామంది యేసును నమ్మి క్రైస్తవ జీవితము ప్రారంభిస్తారు. కానీ ఆత్మీయ జీవితములో ప్రతిరోజు ఎదగకపోతే నెమ్మదిగా సాతాను మనలో అవిశ్వాసము పుట్టిస్తాడు. సంఘమునకు ప్రతివారం వెళుతూ ఉండవచ్చు కానీ మన జీవితము యేసును పోలి ఉండదు, ఆయన రెండవ రాకడకు సిద్ధపడేదిగా ఉండదు.
- బయటకు క్రైస్తవుడిగా, లోపల పాపిగా ఉంటాడు
- జీవితము వాక్య ప్రకారము ఉండదు.
- ఈ వాక్యంలో దుష్ట దాసుడు అధికారమును దుర్వినియోగం చేసినట్లు, ఇతరులను స్వార్ధము కోసం ఉపయోగించుకుంటారు,
- సమాజములో క్రైస్థవునిగా మంచి సాక్ష్యము ఉండదు.
- క్రీస్తు రెండవ రాకడను నమ్మనట్లు వారి జీవితము ఉంటుంది.
- ఈ వాక్యంలో కూడా దుష్ట దాసుడు యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తోటి దాసులను కొట్టి తన ఇష్టము వచ్చినట్లు జీవించడం మొదలు పెట్టాడు. యజమానుడు తిరిగి వచ్చినప్పుడు ఆ దాసునికి పశ్చాత్తాప్పడే సమయము లేదు. దానికి అతడు పొందుకున్న బహుమతి వేషదారులకు చోటైన నరకము.
దుష్ట దాసుడు వలే కాకుండా మన జీవితములను యేసు క్రీస్తు రెండవ రాకడకు సిద్ధపరచుందాం. ఆయన మనకు అప్పగించిన పనిని నమ్మకముగా నెరవేరుద్దాం.
ప్రభువా! మీ రెండవ రాకడ కొరకై సిద్ధపడేవిధముగా మా జీవితములను మార్చండి.
ఈ యొక్క సందేశం ద్వారా ఆత్మీయమగా బలపరచబడినాను