అధ్యాయములు:
1యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తి కొనుచున్నాను.
2నా దేవా, నీయందు నమి్మక యుంచియున్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము నా శత్రువులను నన్నుగూర్చి ఉత్సహింప నియ్యకుము
3నీకొరకు కనిపెట్టువారిలో ఎవడును సిగ్గునొందడు. హేతువులేకుండనే ద్రోహము చేయువారు సిగ్గు నొందుదురు.
4యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము నీత్రోవలను నాకు తేటపరచుము.
5నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీకొరకు కనిపెట్టుచున్నాను.
6యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసి కొనుము నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసికొనుము అవి పూర్వమునుండి యున్నవే గదా.
7నా బాల్యపాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసికొనకుము. యెహోవా నీ కృపనుబట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచు కొనుము.
8యెహోవా ఉత్తముడును యథార్థ వంతుడునై యున్నాడు కావున తన మార్గమునుగూర్చి ఆయన పాపులకు ఉపదేశించును.
9న్యాయవిధులనుబట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును.
10ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసన ములను గైకొనువారి విషయములో యెహోవాత్రోవలన్నియు కృపాసత్యమయములై యున్నవి
11యెహోవా, నా పాపము బహు ఘోరమైనది నీ నామమునుబట్టి దానిని క్షమింపుము.
12యెహోవాయందు భయభక్తులుగలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును.
13అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును.
14యెహోవా మర్మము ఆయనయందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును.
15నా కనుదృష్టి యెల్లప్పుడు యెహోవావైపునకే తిరిగి యున్నది ఆయన నా పాదములను వలలోనుండి విడిపించును.
16నేను ఏకాకిని, బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపుము.
17నా హృదయవేదనలు అతివిస్తారములు ఇక్కట్టులోనుండి నన్ను విడిపింపుము.
18నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నిటిని క్షమింపుము.
19నా శత్రువులను చూడుము, వారు అనేకులు క్రూరద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు.
20నేను నీ శరణుజొచ్చి యున్నాను, నన్ను సిగ్గుపడ నియ్యకుము నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము.
21నీకొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక.
22దేవా, వారి బాధలన్నిటిలోనుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము.