మార్కు 14వ అధ్యాయము

అధ్యాయములు:

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

1రెండు దినములైన పిమ్మట పస్కాపండుగ, అనగా పులియని రొట్టెలపండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులును శాస్త్రులును మాయోపాయముచేత ఆయన నేలాగు పట్టుకొని చంపుదుమా యని ఆలోచించుకొను చుండిరి గాని
2ప్రజలలో అల్లరి కలుగు నేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి.
3ఆయన బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండియున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసికొని వచ్చి, ఆ అత్తరుబుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తలమీద పోసెను.
4అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేల?
5ఈ అత్తరు మున్నూరు దేనార ముల1 కంటె ఎక్కువ వెలకమ్మి, బీదలకియ్యవచ్చునని చెప్పి ఆమెనుగూర్చి సణుగుకొనిరి.
6అందుకు యేసు ఇట్లనెనుఈమె జోలికిపోకుడి; ఈమెను ఎందుకు తొందరపెట్టుచున్నారు? ఈమె నాయెడల మంచి కార్యము చేసెను.
7బీదలు ఎల్లప్పుడును మీతోనే యున్నారు, మీకిష్టమైనప్పుడెల్ల వారికి మేలు చేయ వచ్చును; నేను ఎల్లప్పుడును మీతో నుండను.
8ఈమె తన శక్తికొలదిచేసి, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను.
9సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
10పండ్రెండుమందిలో నొకడగు ఇస్కరియోతు యూదా, ప్రధానయాజకులచేతికి ఆయనను అప్పగింప వలెనని వారియొద్దకు పోగా
11వారు విని, సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టు చుండెను.
12పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కాపశువును వధించునప్పుడు, ఆయన శిష్యులునీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్లి సిద్ధపరచ వలెనని కోరుచున్నావని ఆయన నడుగగా,
13ఆయన మీరు పట్టణములోనికి వెళ్లుడి; అక్కడ నీళ్లకుండ మోయుచున్న యొక మనుష్యుడు మీకెదురుపడును;
14వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ యింటి యజమానుని చూచినేను నా శిష్యులతో కూడ పస్కాను భుజించుటకు నా విడిది గది యెక్కడనని బోధకుడడుగు చున్నాడని చెప్పుడి.
15అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును; అక్కడ మనకొరకు సిద్ధపరచు డని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపెను.
16శిష్యులు వెళ్లి పట్టణములోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధ పరచిరి.
17సాయంకాలమైనప్పుడు ఆయన తన పండ్రెండుమంది శిష్యులతో కూడ వచ్చెను.
18వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసుమీలో ఒకడు, అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా
19వారు దుఃఖపడినేనా అని యొకని తరువాత ఒకడు ఆయన నడుగసాగిరి.
20అందుకాయనపండ్రెండు మందిలో ఒకడే, అనగా నాతోకూడ పాత్రలో (చెయ్యి) ముంచు వాడే.
21నిజముగా మనుష్యకుమారుడు ఆయననుగూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు; అయితే ఎవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో, ఆ మను ష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలనెను.
22వారు భోజనము చేయుచుండగా, ఆయన యొక రొట్టెను పట్టుకొని, ఆశీర్వదించి విరిచి, వారికిచ్చిమీరు తీసికొనుడి; ఇది నా శరీరమనెను.
23పిమ్మట ఆయన గిన్నెపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారి కిచ్చెను; వారందరు దానిలోనిది త్రాగిరి.
24అప్పుడాయన ఇది నిబంధనవిషయమై2 అనేకుల కొరకు చిందింపబడు చున్న నా రక్తము.
25నేను దేవుని రాజ్యములో ద్రాక్షా రసము క్రొత్తదిగా త్రాగుదినమువరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
26అంతట వారు కీర్తన పాడి ఒలీవలకొండకు వెళ్లిరి.
27అప్పుడు యేసు వారిని చూచిమీరందరు అభ్యంతర పడెదరు; గొఱ్ఱల కాపరిని కొట్టుదును; గొఱ్ఱలు చెదరి పోవును అని వ్రాయబడియున్నది గదా.
28అయితే నేను లేచిన తరువాత మీకంటె ముందుగా గలిలయ లోనికి వెళ్లెదననెను.
29అందుకు పేతురుఅందరు అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా
30యేసు అతని చూచినేటి రాత్రి కోడి రెండుమారులు కూయకమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా ననెను.
31అతడు మరి ఖండితముగానేను నీతో కూడ చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనే చెప్పననెను. అట్లు వారందరుననిరి.
32వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు, ఆయన–నేను ప్రార్థనచేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి
33పేతురును యాకోబును యోహానును వెంటబెట్టు కొనిపోయి, మిగుల విభ్రాంతి నొందుటకును చింతా క్రాంతుడగుటకును ఆరం భించెను
34అప్పుడాయననా ప్రాణము మరణమగు నంతగా దుఃఖములో మునిగియున్నది; మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి
35కొంతదూరము సాగిపోయి నేలమీద పడి, సాధ్యమైతే ఆ గడియ తనయొద్దనుండి తొలగిపోవలెనని ప్రార్థించుచు
36నాయనా తండ్రీ, నీకు సమస్తము సాధ్యము; ఈ గిన్నె నాయొద్దనుండి తొలగించుము; అయినను నా యిష్ట ప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్ము అనెను.
37మరల ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచిసీమోనూ, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియ యైనను మేలుకొనియుండలేవా?
38మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగానుండి ప్రార్థన చేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి
39తిరిగి పోయి, యింతకుముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించెను.
40ఆయన తిరిగివచ్చి చూడగా, వారు నిద్రించుచుండిరి; ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను, ఆయనకేమి ఉత్తరమియ్యవలెనో వారికి తోచ లేదు.
41ఆయన మూడవ సారి వచ్చిమీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇక చాలును, గడియ వచ్చినది; ఇదిగో మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడు చున్నాడు;
42లెండి వెళ్లుదము; ఇదిగో నన్ను అప్పగించు వాడు సమీపించియున్నాడని చెప్పెను.
43వెంటనే, ఆయన ఇంకను మాటలాడుచుండగా పండ్రెండుమంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితోకూడ బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని, ప్రధానయాజకులయొద్దనుండియు శాస్త్రులయొద్దనుండియు పెద్దలయొద్దనుండియు వచ్చిరి.
44ఆయనను అప్పగించువాడునేనెవరిని ముద్దుపెట్టు కొందునో ఆయనే (యేసు); ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గురుతు చెప్పియుండెను.
45వాడు వచ్చి వెంటనే ఆయనయొద్దకు పోయిబోధకుడా అని చెప్పి, ఆయనను ముద్దుపెట్టుకొనగా
46వారు ఆయనమీద పడి ఆయనను పట్టుకొనిరి.
47దగ్గర నిలిచి యున్నవారిలో ఒకడు కత్తిదూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను.
48అందుకు యేసుమీరు బందిపోటు దొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొన వచ్చితిరా?
49నేను ప్రతిదినము దేవాలయములో మీయొద్ద ఉండి బోధించు చుండగా, మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే లేఖనములు నెరవేరునట్లు (ఈలాగు జరుగుచున్నదని చెప్పెను).
50అప్పుడు వారందరు ఆయనను విడిచి పారిపోయిరి.
51తన దిగంబర శరీరముమీద నారబట్ట వేసికొనియున్న యొక పడుచువాడు ఆయన వెంట వెళ్లుచుండగా, వారతనిని పట్టుకొనిరి.
52అతడు నారబట్ట విడిచి, దిగం బరుడై పారిపోయెను.
53వారు యేసును ప్రధానయాజకునియొద్దకు తీసికొని పోయిరి. ప్రధానయాజకులు పెద్దలు శాస్త్రులు అంద రును అతనితోకూడవచ్చిరి.
54పేతురు ప్రధానయాజకుని యింటిముంగిటివరకు దూరమునుండి ఆయన వెంటపోయి బంట్రౌతులతోకూడ కూర్చుండి, మంటయొద్ద చలి కాచు కొనుచుండెను.
55ప్రధానయాజకులును మహాసభవారంద రును యేసును చంపింపవలెనని ఆయనమీద సాక్ష్యము వెదకిరిగాని, యేమియు వారికి దొరకలేదు.
56అనేకులు ఆయనమీద అబద్ధసాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు.
57అప్పుడు కొందరు లేచి చేతిపనియైన ఈ దేవాలయమును పడగొట్టి, మూడు దిన ములలో చేతిపనికాని మరియొక దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని
58ఆయనమీద అబద్ధసాక్ష్యము చెప్పిరి
59గాని ఆలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు.
60ప్రధానయాజకుడు వారి మధ్యను లేచి నిలిచిఉత్తరమేమియు చెప్పవా? వీరు నీ మీద పలుకు చున్న సాక్ష్యమేమని యేసు నడిగెను.
61అయితే ఆయన ఉత్తరమేమియు చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడుపరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా? అని ఆయన నడుగగా
62యేసుఅవును నేనే; మీరు మనుష్యకుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశమేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను.
63ప్రధానయాజకుడు తన వస్త్ర ములు చింపుకొనిమనకు ఇక సాక్షులతో పని యేమి?
64ఈ దేవదూషణ మీరు విన్నారు కారా; మీకేమి తోచు చున్నదని అడుగగా వారందరుమరణమునకు పాత్రుడని ఆయనమీద నేరస్థాపనచేసిరి.
65కొందరు ఆయనమీద ఉమి్మవేసి ఆయన ముఖమునకు ముసుకువేసి, ఆయనను గుద్దుచుప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రౌతులును ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి.
66పేతురు ముంగిటి క్రిందిభాగములో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకతె వచ్చి
67పేతురు చలి కాచుకొనుచుండుట చూచెను; అతనిని నిదానించి చూచి నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడ ఉండినవాడవు కావా? అనెను.
68అందుకతడు ఆయన ఎవడో నేనెరు గను; నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవ లోనికి వెళ్లెను; అంతట కోడి కూసెను.
69ఆ పనికత్తె అతనిని చూచివీడు వారిలో ఒకడని దగ్గర నిలిచియున్న వారితో మరల చెప్పసాగెను.
70అతడు మరలనేను కాననెను. కొంతసేపైన తరువాత దగ్గర నిలిచియున్నవారు మరల పేతురును చూచినిజముగా నీవు వారిలో ఒకడవు; నీవు గలిలయుడవు గదా అనిరి.
71అందుకతడుమీరు చెప్పుచున్న మనుష్యుని నేనెరుగనని చెప్పి, శపించుకొనుటకును ఒట్టు బెట్టుకొనుటకును మొదలు పెట్టెను.
72వెంటనే రెండవమారు కోడికూసెను గనుకకోడి రెండు మారులు కూయకమునుపు నీవు నన్ను ఎరుగ నని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయుచు ఏడ్చెను.