నిర్గమకాండము 40వ అధ్యాయము

అధ్యాయములు:

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40

1మరియు యెహోవా మోషేతో ఇట్లనెను
2మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను.
3అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డ తెరతో కప్పవలెను.
4నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసినవాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను.
5సాక్ష్యపు మందసము నెదుట ధూమము వేయు బంగారు వేదికను ఉంచి మందిరద్వారమునకు తెరను తగి లింపవలెను.
6ప్రత్యక్షపు గుడారపు మందిరద్వారము నెదుట దహన బలిపీఠ మును ఉంచవలెను;
7ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్యను గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను.
8తెరలచుట్టు ఆవరణమును నిలువబెట్టి ఆవరణద్వారముయొక్క తెరను తగిలింప వలెను.
9మరియు నీవు అభిషేకతైలమును తీసికొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును.
10దహన బలిపీఠమునకు అభిషేకముచేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను, అప్పుడు ఆ పీఠము అతిపరిశుద్ధ మగును.
11ఆ గంగాళమునకు దాని పీటకు అభిషేకము చేసి దాని ప్రతిష్ఠింపవలెను.
12మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తోడుకొనివచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి
13అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకముచేసి అతని ప్రతిష్ఠింపవలెను.
14మరియు నీవు అతని కుమారులను తోడుకొనివచ్చి వారికి చొక్కాయిలను తొడిగించి
15వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికిని అభిషేకము చేయుము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండుననెను.
16మోషే ఆ ప్రకారము చేసెను; యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటిని చేసెను, ఆలాగుననే చేసెను.
17రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను.
18యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలువ బెట్టి దాని దిమ్మలనువేసి దాని పలకలను నిలువబెట్టి దాని పెండె బద్దలను చొనిపి దాని స్తంభములను నిలువబెట్టి
19మందిరముమీద గుడారమును పరచి దాని పైని గుడారపు కప్పును వేసెను.
20మరియు యెహోవా మోషేకు ఆజ్ఞా పించినట్లు అతడు శాసనములను తీసికొని మందసములో ఉంచి మందసమునకు మోతకఱ్ఱలను దూర్చి దానిమీద కరుణాపీఠము నుంచెను.
21మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను.
22మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరముయొక్క ఉత్తర దిక్కున, అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి
23యెహోవా సన్నిధిని దానిమీద రొట్టెలను క్రమముగా ఉంచెను.
24మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడుప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల యెదుట దీపవృక్షమును ఉంచి
25యెహోవా సన్ని ధిని ప్రదీపములను వెలిగించెను.
26మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డ తెరయెదుట బంగారు ధూపవేదికను ఉంచి
27దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను.
28మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునొద్ద దహనబలిపీఠమును ఉంచి
29దానిమీద దహనబలి నర్పించి నైవేద్యమును సమర్పించెను.
30మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్య గంగాళ మును ఉంచి ప్రక్షాళణకొరకు దానిలో నీళ్లు పోసెను.
31దానియొద్ద మోషేయు అహరోనును అతని కుమారులును తమ చేతులును కాళ్లును కడుగుకొనిరి.
32వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడున బలిపీఠమునకు సమీపించు నప్పుడును కడుగుకొనిరి.
33మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టు ఆవరణమును ఏర్పరచి ఆవరణద్వారపు తెరను వేసెను. ఆలాగున మోషే పని సంపూర్తి చేసెను.
34అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను.
35ఆ మేఘము మందిరముమీద నిలుచుటచేత మందిరము యెహోవా తేజ స్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లలేకుండెను.
36మేఘము మందిరముమీదనుండి పైకి వెళ్లునప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమై పోయిరి.
37ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘముపైకి వెళ్లనియెడల అది వెళ్లు దినమువరకు వారు ప్రయాణము చేయకుండిరి.
38ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటివేళ యెహోవా మేఘము మందిరముమీద ఉండెను. రాత్రివేళ అగ్ని దానిమీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఈలాగుననే జరిగెను.