కీర్తనలు 46వ అధ్యాయము

1దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు
2కావున భూమి మార్పునొందినను నడిసముద్రములలో పర్వతములు మునిగినను
3వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము.(సెలా.)
4ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోష పరచుచున్నవి.
5దేవుడు ఆ పట్టణములో నున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయు చున్నాడు.
6జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదలు చున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరగి పోవుచున్నది.
7సైన్యముల కధిపతియగు యెహోవా మనకు తోడై యున్నాడు. యాకోబుయొక్క దేవుడు మనకు ఆశ్రయమై యున్నాడు.
8యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమిమీద నాశనములు కలుగజేయువాడు.
9ఆయనే భూదిగంతములవరకు యుద్ధములు మాన్పు వాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే.
10ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడ నగుదును భూమిమీద నేను మహోన్నతుడ నగుదును
11సైన్యముల కధిపతియగు యెహోవా మనకు తోడై యున్నాడు యాకోబుయొక్క దేవుడు మనకు ఆశ్రయమై యున్నాడు.