కీర్తనలు 149వ అధ్యాయము

1యెహోవాను స్తుతించుడి యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి.
2ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించినవానినిబట్టి సంతో షించుదురు గాక సీయోను జనులు తమ రాజునుబట్టిఆనందించుదురు గాక.
3నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించు దురు గాక తంబురతోను సితారాతోను ఆయననుగూర్చి గానము చేయుదురు గాక.
4యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును.
5భక్తులు ఘనతనొంది ప్రహర్షించుదురు గాక వారు సంతోషభరితులై తమ పడకలమీద ఉత్సాహ గానము చేయుదురు గాక.
6వారినోట దేవునికి చేయబడు ఉత్సాహస్తోత్రము లున్నవి.
7అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును
8గొలుసులతో వారి రాజులను ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును
9విధింపబడిన తీర్పు వారిమీద నడుపుటకును వారి చేతిలో రెండంచులుగల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికి ఘనత యిదే యెహోవాను స్తుతించుడి.