2 కొరింథీయులకు 5వ అధ్యాయము

అధ్యాయములు:

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

1భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్ట బడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము.
2మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనినవారముగా కనబడుదుము. కాబట్టి పరలోకమునుండివచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము.
3ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గు చున్నాము.
4ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మింగివేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొన గోరుచున్నాము.
5దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే;మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మన కనుగ్రహించియున్నాడు.
6వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొను చున్నాము
7గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామనియెరిగి యుండియు, ఎల్లప్పుడును ధైర్యముగలవారమై యున్నాము.
8ఇట్లు ధైర్యము గలిగి యీ దేహమును విడిచి పెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము.
9కావున దేహమందున్నను దేహమును విడిచినను, ఆయన కిష్టులమై యుండవలెనని మిగుల అపేక్షించుచున్నాము.
10ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.
11కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడినవారము; మీ మనస్సాక్షులకు కూడ ప్రత్యక్షపరచబడియున్నామని నమ్ముచున్నాను.
12మమ్మును మేమే మీ యెదుట తిరిగి మెప్పించుకొనుట లేదు గాని, హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడువారికి ప్రత్యుత్తర మిచ్చుటకు మీకు ఆధారము కలుగవలెనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము.
13ఏలయనగా మేము వెఱ్రివారమైతిమా దేవుని నిమిత్తమే; స్వస్థబుద్ధిగలవారమైతిమా మీ నిమిత్తమే.
14క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు,
15జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించు కొనుచున్నాము.
16కావున ఇకమీదట మేము శరీరరీతిగా ఎవనినైనను ఎరుగము; మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగియుండినను ఇకమీదట ఆయనను ఆలాగు ఎరుగము.
17కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;
18సమస్తమును దేవుని వలననైనవి; ఆయన మనలను క్రీస్తుద్వారా తనతో సమాధానపరచుకొని, ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను.
19అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధానవాక్యమును మాకు అప్పగించెను.
20కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమైదేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము.
21ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.