1 రాజులు 17వ అధ్యాయము

అధ్యాయములు:

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22

1అంతట గిలాదు కాపురస్థుల సంబంధియును తిష్బీ యుడునైన ఏలీయా అహాబునొద్దకు వచ్చిఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవాజీవముతోడు నా మాట ప్రకారము గాక, యీ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటిం చెను.
2పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై
3నీవు ఇచ్చటనుండి తూర్పువైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగుదగ్గర దాగియుండుము;
4ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా
5అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను.
6అక్కడ కాకోలములు ఉదయ మందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతనియొద్దకు తీసికొనివచ్చుచుండెను; అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను.
7 కొంతకాలమైనతరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను.
8అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెనునీవు సీదోను పట్టణ సంబంధ మైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము;
9 నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక విధవరాలికి నేను సెల విచ్చితిని.
10అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవినియొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసికొనిరమ్మని వేడుకొనెను.
11ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడామెను మరల పిలిచినాకొక రొట్టెముక్కను నీ చేతిలో తీసికొని రమ్మని చెప్పెను.
12అందుకామెనీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నాయొద్దనున్నవే గాని అప్పమొకటైన లేదు, మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసికొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితిననెను.
13అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లనెనుభయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము; అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదటచేసి నాయొద్దకు తీసికొనిరమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసికొనుము.
14భూమిమీద యెహోవా వర్షము కురిపించువరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువకాదు, బుడ్డిలో నూనె అయిపోదని
15ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు అనెను. అంతట ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాటచొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె యింటి వారును అనేకదినములు భోజనముచేయుచు వచ్చిరి.
16యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు.
17అటుతరువాత ఆ యింటి యజ మానురాలైన ఆమె కుమారుడు రోగియై ప్రాణము నిలువ జాలనంత వ్యాధిగలవాడాయెను.
18ఆమె ఏలీయాతోదైవజనుడా, నాయొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకముచేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా
19అతడునీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి, ఆమె కౌగిటిలోనుండి వానిని తీసికొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచముమీద వాని పరుండబెట్టి
20యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన యీ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమెమీదికి కీడు రాజేసితివా అని యెహో వాకు మొఱ్ఱపెట్టి
21ఆ చిన్న వానిమీద ముమ్మారు తాను పారచాచుకొనియెహోవా నా దేవా, నా మొఱ్ఱ ఆలకించి యీ చిన్న వానికి ప్రాణము మరల రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా
22 యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రదికెను.
23 ఏలీయా ఆ చిన్నవాని తీసికొని గదిలోనుండి దిగి యింట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి–ఇదిగో నీ కుమారుడు; వాడు బ్రదుకుచున్నాడని చెప్పగా
24ఆ స్త్రీ ఏలీయాతోనీవు దైవజనుడవై యున్నావనియు నీవు పలుకుచున్న యెహోవామాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదు ననెను.