1 యోహాను 4వ అధ్యాయము

అధ్యాయములు:

1 2 3 4 5

1ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకము లోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.
2యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని, యే ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది;
3యే ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు; దీనినిబట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తువిరోధి ఆత్మ వచ్చునని మీరు వినినసంగతి ఇదే; యిదివరకే అది లోకములో ఉన్నది.
4చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు.
5వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాటలాడుదురు, లోకము వారి మాట వినును.
6మనము దేవుని సంబంధులము; దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూప మైన ఆత్మ యేదో, భ్రమపరచు ఆత్మ యేదో తెలిసికొను చున్నాము.
7ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవునిమూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును.
8దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.
9మనము ఆయన ద్వారా జీవించు నట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.
10మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.
11ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింప బద్ధులమై యున్నాము.
12ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు; మన మొకనినొకడు ప్రేమించిన యెడల దేవుడు మనయందు నిలిచియుండును; ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును.
13దీనివలన మనము ఆయనయందు నిలిచియున్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలిసికొనుచున్నాము; ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసియున్నాడు.
14మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి, సాక్ష్యమిచ్చు చున్నాము.
15యేసు దేవుని కుమారుడని యెవడు ఒప్పు కొనునో, వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవునియందున్నాడు.
16మనయెడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగినవారమై దాని నమ్ముకొనియున్నాము; దేవుడు ప్రేమాస్వరూపియై యున్నాడు, ప్రేమయందు నిలిచి యుండువాడు దేవునియందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు నిలిచియున్నాడు.
17తీర్పుదినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి యున్నది; ఏలయనగా ఆయన ఎట్టివాడై యున్నాడో మనముకూడ ఈ లోకములో అట్టివారమై యున్నాము.
18ప్రేమలో భయముండదు; అంతేకాదు; పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును; భయము దండనతో కూడినది; భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు.
19ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.
20ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు
21దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలె నను ఆజ్ఞను మనమాయనవలన పొందియున్నాము.