మనుష్యుని అపవిత్రత

మార్కు 7:14-23
14అప్పుడాయన జనసమూహమును మరల తనయొద్దకు పిలిచిమీరందరు నా మాట విని గ్రహించుడి. 15వలుపలినుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియు లేదు గాని,16లోపలినుండి బయలు వెళ్లునవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను. 17ఆయన జనసమూహమును విడిచి యింటి లోనికి వచ్చినప్పుడు, ఆయన శిష్యులు ఉపమానమును గూర్చి ఆయన నడుగగా 18ఆయన వారితో ఇట్లనెనుమీరును ఇంత అవివేకులై యున్నారా? వెలుపలినుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వాని నపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? 19అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్బూమిలో విడువబడును; ఇట్లు అది భోజనపదార్థము లన్ని టిని పవిత్రపరచును. 20మనుష్యుని లోపలినుండి బయలు వెళ్లునది మనుష్యుని అపవిత్రపరచును. 21లోపలినుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును 22నరహత్యలును వ్యభి చారములును లోభములును చెడుతనములును కృత్రిమ మును కామవికారమును మత్సరమును3 దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును. 23 చెడ్డ వన్నియు లోపలినుండియే బయలువెళ్లి, మనుష్యుని అప విత్ర పరచునని ఆయన చెప్పెను

ఒకరోజు యేసు క్రీస్తు శిష్యులు కడుగని చేతులతో భోజనం చేస్తున్నారు. అది చూచిన పరిసయ్యలు, శాస్త్రులు నీ శిష్యులెందుకు ఆచారము చొప్పున నడుచుకొనుటలేదు అని యేసును అడిగారు. ఆ సందర్భములో యేసు క్రీస్తు ఈ వాక్యములు చెప్పారు. అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనం చేస్తే మనం అపవిత్రం అవుతాం అని యూదుల నమ్మకం, ఆచారం. మనుష్యులు ఎప్పుడు అపవిత్రం అవుతారో యేసు క్రీస్తు ప్రభువు ఇక్కడ వివరించారు. బయట నుండి లోపలకు వెళ్ళేవి మనల్ని అపవిత్రం చేయలేవు. అవి హానికరమైనవైతే మన శరీరమును కీడు చేస్తాయి గానీ మన ఆత్మలను(soul) అపవిత్రం చేయలేవు. మనలను అపవిత్రం చేయడం హృదయం చేతులో ఉంది. దురాలోచనలును జారత్వములును దొంగతనములును నరహత్యలును వ్యభి చారములును లోభములును చెడుతనములును కృత్రిమ మును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును ఇటువంటి చెడ్డవన్నీ హృదయములోనుండి బయట పడి మనల్ని అపవిత్రం చేస్తాయి. మన నుండి ఏమి వస్తున్నాయో మనం ఈరోజు ప్రశ్నించుకోవాలి. మన హృదయం శుద్ధిగా, పవిత్రముగా దేవుని చిత్తప్రకారం నడుచుకుంటుందా? లేక శరీరాశల చొప్పున నడుచుకుంటుందా? పవిత్రమైన, నిష్కలంకమైన హృదయముతోనే మనం దేవుని దగ్గరకు వెళ్ళగలం.

కీర్తనలు 24:3-4
యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు? 4వ్యర్థమైనదానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే.

ఈరోజు మన దృష్టి ఎక్కడ ఉంది? మన ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి? మనము దేవునికి సంబంధించిన విషయముల గురించి ఆలోచిస్తే మన హృదయం కూడా అక్కడే ఉంటుంది. అందుకే క్రీస్తులో మనం ఎదగాలంటే పరలోక విషయములపై దృష్టి పెట్టాలి. నశించిపోయే ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి క్రీస్తుతో నడవాలి.

లూకా 12:34
మీ ధనమెక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును.

దురాలోచనలును జారత్వములును దొంగతనములును నరహత్యలును వ్యభి చారములును లోభములును చెడుతనములును కృత్రిమ మును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును ఇటువంటి వాటిలో మనం పాలు పంచుకున్నట్లయితే దేవుని దృష్టిలో మనం అపవిత్రులమే. మన పాప స్వభావమును విడిచిపెట్టాలంటే ఒకటే మార్గం. అది యేసు క్రీస్తు. ఆయనే జీవము, మార్గము, సత్యము. మన పాపములకు శిక్ష ఆయన శిలువపై అనుభవించాడు. మన పాపములను ఒప్పుకొని, ఆయన మనకోసం చనిపోయి మూడవ దినమును తిరిగి లేచారని నోటితో ఒప్పుకొని, హృదయములో విశ్వసిస్తే మనం రక్షించబడతాం. పాపమునకు బానిసత్వము నుండి, నరకము నుండి రక్షించబడతాం. పరలోకమునున్న తండ్రిని చేరుకోవడానికి, ఆయనతో ప్రతిరోజు మాట్లాడటానికి క్రీస్తే మార్గము.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *