క్రీస్తును కలిగిన క్రిస్మస్ – దేవుని యొక్క గొప్ప బహుమతి!

ఈ క్రిస్మస్ సీజన్  లో షాపింగ్ మాల్స్, బజార్లు అన్నీ శాంటా ఫోటోలు మరియు వివిధ రకాల అలంకరణలతో ధగ ధగ లాడుతుంటాయి. ఇవన్నీ పిల్లలను మరియు పెద్దలను షాపింగ్ కి ఆకర్షించడానికి వ్యాపారస్తులు వాడే ఒక పద్ధతి. పిల్లలు కూడా నిజంగానే శాంటా వారికి బహుమతులు తీసుకువస్తాడు అని ఎదురుచూస్తుంటారు. నిజానికి క్రిస్మస్ కి, శాంటా కి ఎటువంటి సంబంధం లేదు. చాలామంది పెద్దవాళ్ళు కూడా వారి పిల్లలకు శాంటా గురించి చెబుతారు గాని, దేవుడు మానవాళికి ఇచ్చిన గొప్ప బహుమతి గురించి అంత ఎక్కువగా వివరించరు. ఆ బహుమతి ఎవ్వరూ డబ్బుతో కొనలేనిది, ఎంత బంగారం, వెండి, వజ్రాలతోనైనా వెలకట్టలేనిది, దానికి సరితూగగల వస్తువు గాని, బహుమతి గాని ఎప్పుడూ లేదు, ఇకముందు రాబోదు.

రోమీయులకు 6:23
ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.

ఆ బహుమతి నిత్యజీవితము ( eternal life). దానిని పొందుకోవాంటే కావాల్సిన అర్హత యేసు క్రీస్తును కలిగియుండడం. దేవుడు మనందరికీ యేసు క్రీస్తు ద్వారా రక్షణ, నిత్య జీవము అనే గొప్ప బహుమతి ఇవ్వాలని కోరుకుంటున్నారు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి, మన కోసం తన అద్వితీయ కుమారుని మన కోసం ఈలోకానికి పంపెను. యేసు క్రీస్తు మనం పాపులముగా ఉండగానే మనకోసం సిలువపై శిక్ష అనుభవించి మనకు దేవునితో జీవించే మార్గాన్ని ఏర్పరిచారు. అందుకే యేసు క్రీస్తు పుట్టిన ఆ రోజును గుర్తు చేసుకొని, ఆయనను ఆరాధించడమే క్రిస్మస్.  ఈ రోజు మానవాళికి పాప విముక్తి కోసం నాంది పలికిన రోజు. దేవుడే భూమిపైకి మానవరూపంలో పుట్టిన రోజు. ఈ సమయంలో మనం వేసుకోవాల్సిన ప్రశ్న, మనము యేసును కలిగియున్నామా? దేవుడు మనకు ఇస్తున్న నిత్యజీవితము అనే బహుమతి కలిగియున్నామా?

యెషయా 9:6
ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

మనము ఈ క్రీస్తును కలిగియున్నామా? యేసుక్రీస్తు ద్వారా రక్షణ అనే  ఈ బహుమతి తాళం వేసియున్న ఒక గిఫ్ట్ బాక్స్ వంటిది. ఆ బాక్స్ అందరికి అందుబాటులో ఉంది, కానీ అందులో ఉన్న బహుమతి పొందుకోవాలంటే, మనం చేయాల్సిన పని దేవుడిని అడగడమే. మత్తయి 7:11 లో చెప్పినట్లు దేవుడు మనకు గొప్ప బహుమతి ఇవ్వాలనుకుంటున్నారు. మన పాపములకు పశ్చాత్తాప్పడి, ఆయనను ప్రభువుగా అంగీకరిస్తే ఆ నిత్యజీవితము మనకు దక్కుతుంది. క్రిస్మస్ సందేశములో మనము నాలుగు ముఖ్య భాగములు చూడొచ్చు.

మత్తయి 7:11
పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యీవుల నిచ్చును.

ప్రేమ సందేశము:

తన సొంత కుమారుడిని త్యాగం చేయడంలో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్ధం అవుతుంది. మనం రక్షణకు అర్హులము కాకపోయినా, మనం ఆయన ఆజ్ఞలను అతిక్రమించినా ఆయన మనకోసం యేసు పంపించారు. అంతేకాకుండా దేవుని ప్రేమకు ఎటువంటి షరతులు లేవు. ఆయన ప్రేమ పరమితి లేనిది, అంతులేనిది.

యోహాను 3:16
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా3 పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.

యేసు క్రీస్తు మనల్ని యేసుతో ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టారు. ఆయనను ప్రజలు హింసించినా, ఛీకొట్టినా, చిత్ర హింసలుపెట్టినా, చివరికి వారిని కూడా క్షమించి మనందరి కోసం రక్తప్రోక్షణగా ఆ శిలువపై బలియాగం అయ్యారు. పరలోకములో ఇప్పటికీ తండ్రియొద్ద మనకొరకు ప్రార్థిస్తున్నారు. మనకోసం ప్రాణం పెట్టిన ఆ యేసు ప్రేమ మనలో ఉందా? ఆ దేవుని ప్రేమను మనము కూడా మన జీవితాల ద్వారా అందరికి పంచుతున్నామా? దేవుని ప్రేమ, రక్షణ మనం సొంతగా సంపాదించుకోలేం. అవి మనకు ఆయన ప్రసాదించిన వరం. మనము కూడా ఇతరులకు ఇచ్చే వారీగా, దానం చేసేవారిగా ఉన్నామా లేక ఎప్పుడూ మన కొరకే తీసుకొనేవారిగా ఉన్నామా అని ఆలోచించుకోవాలి.

యోహాను 1:10-11

మీ జీవితములో ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? మీ కుటుంబములో గానీ, స్కూల్లో గానీ, ఉద్యోగములో గానీ మీకు విలువ లేదు అనుకుంటున్నారా? మీ కుటుంబములో గానీ, బంధువులతో గాని ప్రేమను పొందలేకపోతున్నారా? భయపడవద్దు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, అందుకే యేసును పంపించారు. దేవుడు దృష్టిలో మీకు ఎంతో విలువ ఉంది. మీరు పుట్టక ముందే ఆయనకు మీ గురుంచి తెలుసు, మిమ్మల్ని ఆయన సొంత హస్తాలతో దేవుడు చెక్కారు. ఆయన ప్రేమను యేసు క్రీస్తు లో పొందుకొనండి.

 

సంతోషకరమైన సందేశం:

ఒకవేళ మనకు ఒక కోటి రూపాయలు అప్పు ఉంటే, ఎవరైనా వచ్చి ఎటువంటి షరతులు  లేకుండా  మన అప్పు మొత్తం తీర్చేస్తానంటే సంతోష పడని వారు  ఎవరూ ఉండరేమో. యేసు క్రీస్తు కూడా మనల్ని పాపమూ నుండి విడిపించడానికి తీర్చాల్సిన అప్పును శిలువపై తీర్చేసారు. అందుకే ఇది సంతోషకరమైన సందేశం. క్రిస్మస్ కథ లో కూడా, నీవు ఒక రక్షకుడికి జన్మనివ్వబోతున్నావని తెల్సిన తరువాత మేరీ మొదట్లో భయపడినా, తరువాత ఎంతో సంతోషించింది. ఎలిజబెత్ ను కల్సిన తరువాత మేరీ దేవుని స్తుతిస్తూ పాట కూడా పడుతుంది. గొల్లలు యేసు క్రీస్తును తొట్టిలో చూసిన తరువాత ఆనందముతో అక్కడినుండి వెళ్లారు అని ఉంటుంది.

 గలతీయులకు 3:13-15

సమాధానకర సందేశం:

యెషయా 9:6 లో ప్రవచించినట్లు యేసు సమాధానకర్తగా జన్మించారు. మన జీవితములో ఎటువంటి సమస్య ఉన్నా, ఆందోళన, భయం ఉన్నా సమాధానం ఇవ్వగలిగిన ఒకే ఒక్కరు యేసుక్రీస్తు. మేరీ కి, యోసేపుకు, గొల్లలకు దేవుని దూతలు ప్రత్యక్షమైనప్పుడు మొదటిగా చెప్పింది “భయపడకు” అని. దేవుడు మన తోడుగా ఉంటే భయపడాల్సిన పనిలేదు. కానీ మనతో దేవుడు ఉన్నాడా? మీకు జీవితంలో ఒదుడుకులుగా ఉందా? ఎటువైపు వెళ్లాలో తెలియట్లేదా? సమాధానకర్తయైన యేసుయొద్దకు రండి.

యోహాను 14:27
శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయ మును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.

దృఢ విశ్వాసము (Hope) సందేశము:

పాత నిభంధన గ్రంథము లో  ప్రవచించినట్లుగానే, యూదులు ఎదురుచూస్తున్న మెస్సయ్య ప్రవచనములను దేవుడు యేసు క్రీస్తులో దేవుడు నెరవేర్చాడు. యూదులు యేసును మెస్సయ్యగా నమ్మకపోయినా ప్రవక్తల ధృడ విశ్వాసము నిజమైనది. యేసు మొదటి రాకడ ప్రవచనాల ప్రకారం జరిగినట్లుగానే, రెండవ రాకడ కూడా ఖచ్చితముగా జరుగుతుంది. యేసు క్రీస్తు జననం ధ్యానించడం  ద్వారా మనకు రెండవ రాకడ గురించిన ధృడ విశ్వాసము పెరగాలి. దేవునితో నిత్యజీవితము నివశించే ఆ రోజు కోసం, యేసును ప్రత్యక్షముగా దర్శించే ఆ రోజు కోసం మనము ధృడ విశ్వాసం కలిగి యుండాలి. తారను అనుసరిస్తూ యేసును చూడటానికి బయలుదేరిని జ్ఞానులు కూడా చివరివరకు దృఢవిశ్వాసం కలిగి యున్నారు. ఎక్కడా కూడా వారి గమ్యము నుండి వారు బయటకు రాలేదు. పరలోకము చేరే విషయములో కూడా మనము ప్రతిరోజు సిద్ధపడుతూ ఎక్కువ దృఢ విశ్వాసం కలిగియుండాలి.

 1 పేతురు 1:3-9

మీ జీవితములో ఏమీ సాధించలేదు అనిపిస్తుందా? దేవుని సువార్త కొరకు ఏమీ చేయలేదు అనిపిస్తుందా? యేసు యొద్దకు రండి, ఆయన చిత్తానికి మనల్ని అర్పించుకుంటే ఆయన మీ జీవితాన్ని మారుస్తారు.

ఈ ప్రేమ, ఆనందము, క్షమాగుణం, దృఢ విశ్వాసం మీ జీవితములో ఉండాలంటే దేవుడు ఇస్తున్న ఈ గొప్ప బహుమతిని అంగీకరించండి. యేసు క్రీస్తును విశ్వసించి నిత్యజీవము అనే బహుమతిని స్వీకరించండి.

మీరు యేసును ఇప్పటికే అంగీకరిస్తే, యేసు క్రీస్తు పంచిన ప్రేమను, క్షమాపణను ఇతరులతో పంచుకోండి. మీరు పొందుకున్న బహుమతిని ఇతరులతో కూడా పంచుకొనండి. దేవుడు మీతో తోడుగా ఉండి, ఆత్మీయ జీవితములో మీరు ఎదిగేలా,  యేసు క్రీస్తు మీకు అప్పగించిన కార్యమును మీ జీవితములో నిర్వహించేలా శక్తిని ప్రసాదించుగాక.

మీకు, మీ కుటుంబసభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు! దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *